కుక్క నోటికి ప్లాస్ట‌ర్ చుట్టి..

Dog With Its Mouth Sealed By Tape For 2 Weeks In Kerala - Sakshi

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లో గ‌ర్భిణీ ఏనుగు చ‌నిపోయిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే త్రిశూర్‌లో మ‌రో ఉదంతం చోటుచేసుకుంది. మూడేళ్ల వ‌య‌సున్న కుక్కను హింసించిన ఘటన వెలుగులోకి  వచ్చింది. దాని నోటికి ప్లాస్ట‌ర్ చుట్ట‌డంతో దాదాపు రెండు వారాలుగా తిండి, నీళ్లు కూడా తీసుకోక‌పోవడంతో సొమ్మ‌సిల్లి ప‌డిపోయింది. చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ మూగ‌జీవిని పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీసెస్ స‌భ్యులు కాపాడారు. స్థానికుల స‌మాచారంతో త్రిశూర్ లోని ఒల్లూర్ జంక్షన్ వ‌ద్ద ఈ కుక్కను కనుగొన్నారు. కుక్క నోటికి అనేక పొర‌ల‌తో ప్లాస్ట‌ర్ చుట్టి ఉండ‌టంతో చ‌ర్మం పూర్తిగా దెబ్బ‌తింది. ఎముక‌ల‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీసెస్ కార్య‌ద‌ర్శి రామ‌చంద్ర‌న్ తెలిపారు. కుక్క‌కు ఉంచిన టేప్ తీయ‌గానే దాదాపు రెండు లీట‌ర్ల నీరు తాగింద‌ని పేర్కొన్నారు. రెండు వారాలుగా ఆహారం, నీళ్లు కూడా తీసుకోవ‌డానికి వీల్లేనందున బాగా నీర‌సించింద‌ని వివ‌రించారు. (అట్ట పెట్టెలో యువతి మృతదేహం!)

కేర‌ళ‌లో గర్భిణీ ఏనుగు ఉదంతం తీవ్ర క‌ల‌క‌లం రేగిన సంగ‌తి తెలిసిందే. అది మ‌రువ‌క‌ముందే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఆవు నోట్లో బాంబు పేలి చ‌నిపోయింది. తాజాగా మూడేళ్ల వ‌య‌సున్న కుక్క నోటికి ప్లాస్ట‌ర్ చుట్టడంతో చావు అంచుల దాకా వెళ్లింది. వ‌రుస ఉదంతాలు జంతు ప్రేమికుల‌ను తీవ్ర క‌ల‌వ‌ర పాటుకు గురిచేస్తున్నాయి. బాధితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. (కేరళ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాం: పర్యావరణ శాఖ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top