‘న్యాయ’ స్వతంత్రత అత్యున్నతం!

cji dipak misra farewell ceremony - Sakshi

తీర్పులు మానవీయ కోణంలో ఉండాలి

వీడ్కోలు ప్రసంగంలో సీజేఐ దీపక్‌ మిశ్రా

చివరి రోజు విధుల్లో భావోద్వేగం

బుధవారం తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగోయ్‌ బాధ్యతలు

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రత అత్యున్నతంగా ఉందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం జడ్జీల మధ్య సహకారపూరిత వాతావరణం నెలకొందని చెప్పారు. మంగళవారం పదవీ విరమణ చేయబోతున్న ఆయన గౌరవార్థం సోమవారం కోర్టు ప్రాంగంణంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ ప్రపంచంలోనే మన న్యాయ వ్యవస్థ అత్యంత పటిష్టమైనది, దృఢమైనదన్నారు. ‘ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పలానా వైపునకు మొగ్గుచూపదు. నిష్పాక్షికతకు సూచికగా న్యాయ దేవత కళ్లకు గంతలు కడతాం.

చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా అన్ని కేసులను ఒకేలా చూస్తాం. ఎల్లప్పుడూ తీర్పు మానవీయ కోణంలో ఉండాలి. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కోలా ఉంటుంది. వ్యక్తుల నేపథ్యాలు కాకుండా వారి కార్యకలాపాలు, ఆలోచనారీతుల ఆధారంగానే తీర్పులిచ్చాను’ అని అన్నారు. అంతకుముందు, కాబోయే సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. ఆధార్, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలపై ఇటీవల ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో విఫలమైతే, ఒకరినొకరం చంపుకుంటూ, ద్వేషించుకూంటూ ఉంటామని వ్యాఖ్యానించారు. మనం ఏం తినాలి, ఏం ధరించాలి లాంటివి వ్యక్తిగత జీవితాల్లో ప్రముఖ విషయాలుగా మారాయని అన్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ బుధవారం బాధ్యతలు చేపడతారు.

సీజేఐగా చివరిసారి
సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సోమవారం చివరిసారిగా విధులు నిర్వర్తించారు. తదుపరి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, మరో జడ్జి ఏఎం ఖన్విల్కర్‌తో కలసి సుమారు 25 నిమిషాల పాటు కోర్టు కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం అత్యవసర కేసుల విచారణ ఉండదని, అలాంటి కేసులేవైనా ఉంటే అక్టోబర్‌ 3న కొత్త సీజేఐ నేతృత్వంలో చేపడతామని ఆ ముగ్గురితో కూడిన బెంచ్‌ స్పష్టం చేసింది.

సీజేఐగా చివరి రోజు కావడంతో  జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కాస్త భావోద్వేగంతో కనిపించారు. జస్టిస్‌ మిశ్రాకు దీర్ఘాయుష్షు కాంక్షిస్తూ, సాధారణంగా పుట్టినరోజు నాడు పాడే 1950 నాటి హిందీ సినిమాలోని పాటను పాడటానికి ఓ లాయర్‌ ప్రయత్నించగా వద్దని సున్నితంగా వారించారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో రిటైర్మెంట్‌ తరువాతి ప్రణాళికలు ఏమిటని ఓ జర్నలిస్టు అడగ్గా..‘జోతిష్యం సైన్స్‌ కాకపోయినా ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తు గురించి చెప్పడానికి నేను జోతిష్యుడిని కాను’ అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బదులిచ్చారు.

కొన్ని కీలక కేసులు, తీర్పులు..
► ఆధార్‌ చట్టబద్ధమేనని తీర్పు

► వివాహేత సంబంధాలు నేరం కాదని, ఐపీసీ సెక్షన్‌ 497 కొట్టివేత

► స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సెక్షన్‌ 377 కొట్టివేత

► శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలందరికీ అనుమతిస్తూ తీర్పు

► ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్రను ఈసీకి తెలపాలంటూ ఆదేశాలు

► అయోధ్య కేసు

► ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా

► మూక హత్యల కట్టడికి ప్రభుత్వాలకు ఆదేశాలు

► నిర్భయ గ్యాంగ్‌రేప్‌లో కేసులో దోషుల మరణశిక్షకు సమర్థన

► బీసీసీఐలో సంస్కరణలు

► ఖాప్‌ పంచాయతీలపై నిషేధం
► ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్‌ మెమె న్‌ పిటిషన్‌ను అర్ధరాత్రి దాటిన తరువాత విచారించిన బెంచ్‌కు జస్టిస్‌ మిశ్రా సారథ్యం.. మెమెన్‌ మరణశిక్షకు సమర్థన.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top