దేశ రాజధాని మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ కారు దొంగ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈఘటన ఢిల్లీ నగర శివారులోని కన్జవ్లాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నుంచి ఒక మారుతి హోండాకారును దొంగిలిస్తూ పారిపోతున్న కొందరు పోలీసుల కంటపడ్డారు.
సినీఫక్కీలో వెంబడిస్తున్న పోలీసులపై వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఒక దుండగుడు మరణించాడు. మిగతావారు పారిపోయారు. బుల్లెట్ గాయంతో పడిఉన్న అభిషేక్ అనే మరో వ్యక్తిని సావిత్రి ఆస్పత్రి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.