
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సైనికులతో సరిహద్దు ఘర్షణలో లడఖ్‌లో 20 మంది భారత సైనికులు మరణించిన ఘటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ప్రధానిని ప్రశ్నించడం ద్వారా రాహుల్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా అన్నారు. దేశం కోసం 20 మంది సైనికులు ప్రాణత్యాగం చేసిన సమయంలో ప్రధానికి వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సంబిట్ పేర్కొన్నారు.
సరిహద్దు వివాదంపై ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం జరిగేవరకూ రాహుల్ గాంధీ వేచిచూడాల్సి ఉందని అన్నారు. సంక్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదనే రీతిలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు సరైంది కాదని దుయ్యబట్టారు. దేశమంతా సైన్యం, ప్రభుత్వం వెంట నిలబడాల్సిన సమయంలో విపక్షం తీరు దురదృష్టకరమని బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధులకు అవకాశమిచ్చే వ్యాఖ్యలు చేయడం రాహుల్‌కు తగదని మండిపడ్డారు. చైనా తన వాదనలకు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు ఉటంకిస్తోందని చెప్పుకొచ్చారు.