విధానసౌధలో బీజేపీ ఆందోళన

BJP to protest in Karnataka demanding CM Kumaraswamy is resignation - Sakshi

సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్‌

రాజీనామా చేసిన ఎమ్మెల్యే సుధాకర్‌ను నిర్బంధించిన కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్న బీజేపీ నేతలు బుధవారం రంగంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు విధానసౌధ(అసెంబ్లీ) ముందు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహం ముందు బైఠాయించిన నేతలు, కుమారస్వామి  సీఎం పదవికి రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం నాటికి 16 మంది కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ జవాబిచ్చారు. గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, బలపరీక్షకు ఆదేశించినా బీజేపీ శిరసావహిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ 9 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో వీరంతా గురువారం మరోసారి రాజీనామాలను సమర్పించారు.

మెజారిటీ కోల్పోయారు: యడ్యూరప్ప
‘ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఆలస్యం చేయకుండా ఆమోదిస్తే జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగవు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. కాబట్టి సీఎం కుమారస్వామి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని తన పదవికి రాజీనామా చేస్తే మంచిది’ అని యడ్యూరప్ప హితవు పలికారు. మరోవైపు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌తో బుధవారం సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందం.. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాజాగా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు షాకిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో అధికార కూటమి నుంచి రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్య 16(13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు)కు చేరుకుంది. రాజీనామా చేసేందుకు స్పీకర్‌ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్, జేడీఎస్‌ నేతలు నిర్బంధించారు. విధానసౌధ మూడో అంతస్తులో మంత్రి కేజే జార్జ్‌ కార్యాలయంలోకి సుధాకర్‌ను లాకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న సిద్దరామయ్య మంత్రి పదవి ఇస్తామనీ, రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తనకు నమ్మకం పోయిందనీ, రాజీనామా చేస్తున్నానని సుధాకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు సుధాకర్‌ భార్య వజూభాయ్‌వాలాకు ఫోన్‌ చేయడంతో వెంటనే ఎమ్మెల్యేలను తన దగ్గరకు తీసుకురావాలని నగర కమిషనర్‌ను గవర్నర్‌ ఆదేశించారు. దీంతో కమిషనర్‌ స్వయంగా ఎమ్మెల్యేను రాజ్‌భవన్‌కు తీసుకురావడంతో వ్యవహారం సద్దుమణిగింది.

అన్ని హద్దులు దాటేశారు: కుమారస్వామి
బీజేపీ అన్ని చట్టాల ఉల్లంఘన విషయంలో అన్ని హద్దులు దాటేసిందని  కుమారస్వామి విమర్శించారు. బీజేపీ రాజకీయం చేస్తోందా? లేక వక్రబుద్ధి ప్రదర్శిస్తోందా? అని నిలదీశారు. మంత్రి శివకుమార్‌కు రక్షణ కల్పించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top