 
															నడిరోడ్డుపై కిరాతకం
నడిరోడ్డుపై పదవ తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్యచేసిన ఘటన బిహార్ లో సంచలనం రేపింది.
	కైముర్: నడిరోడ్డుపై పదవ తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్యచేసిన ఘటన బిహార్ లో సంచలనం రేపింది. 15 బాలికను ముగ్గురు దుండగులు తమ బైకుతో ఈడ్చుకెళ్లి దారుణంగా చంపేశారు. కైముర్ జిల్లా కార్జావ్ గ్రామంలో హాటా-దుర్గావతి ప్రధాన రహదారిపై మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
	
	ఫకారాబాద్ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాసేందుకు వెళుతుండగా బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె దుప్పటా(చున్నీ) పట్టుకుని లాగారు. మెడకు చున్నీ చుట్టకుని ఆమె కింద పడిపోయింది. ఆమెను బైకుతో 50 మీటర్ల వరకు ఈడ్చుకుపోయారు. అక్కడితో ఆగకుండా ఆమెపైనుంచి బైకు నడిపారు. తీవ్రగాయాలతో బాధితురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. బైకు గోతిలో పడి ముగ్గురు దుండగులు కిందపడిపోయారు. వీరిని స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో బైకు అక్కడే వదిలేసి పారిపోయారు.
	
	ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాలిక మృతదేహంతో  రోడ్డుపైనే బైఠాయించారు. హంతకులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఏఎస్పీ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
