తరగతి గదిలో దస్తూరి తిలకం

Atal Bihari Vajpayee Classroom In Gwalior - Sakshi

గ్వాలియర్‌లో వాజ్‌పేయి చదువుకున్న పాఠశాల ఆయన జ్ఞాపకాల్లో తడిసిముద్దవుతోంది. ఆయన చేతిరాతతో ఉన్న రిజిస్టర్‌ తమకు పెన్నిధి అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజ్‌పేయి దంపతులకు 1924 సంవత్సరం క్రిస్మస్‌ పర్వదినం రోజు జన్మించిన అటల్‌ బిహారి వాజ్‌పేయి గోరఖి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఆ పాఠశాలకు వాజ్‌పేయి తండ్రే ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. వాజ్‌పేయి స్కూలు రిజిస్టర్‌లో తన స్వదస్తూరితో పేరును రాసుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, వాజ్‌పేయి చేతిరాత ఉన్న రిజిస్టర్‌ మాత్రం పదిలంగా ఉంది. ‘ఈ రిజిస్టర్‌ మాకో నిధిలాంటిది.  నెంబర్‌ 101 దగ్గర ఉన్న పేరు వాజ్‌పేయిదే. 1935లో ఆరో తరగతిలో చేరడానికి వచ్చినప్పుడు వాజపేయి స్వయంగా తన పేరుని రాసుకున్నారు. ఇప్పుడే ఇది ఒక చారిత్రక పత్రంగా మారింది‘ అని స్కూలు ప్రిన్సిపాల్‌ కె.ఎస్‌.రాథోడ్‌ ఉద్వేగంగా చెప్పారు. అంతేకాదు ఆ పాఠశాలను కూడా స్థానికులు అటల్‌ జీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ పాఠశాల అలాగే గుర్తింపు ఉంది. స్కూల్‌ రోజుల్లో వాజ్‌పేయి కబడ్డీ, హాకీ ఆటలు ఆడేవారు.

అందరు విద్యార్థుల మాదిరిగానే సైకిల్‌ వేసుకొని పట్టణం అంతా చక్కెర్లు కొట్టేవారు. చిన్నప్పట్నుంచి అటల్‌జీకి స్వీట్లు అంటే ప్రాణం. గ్వాలియర్‌ ఎప్పుడు వచ్చినా తనకిష్టమైన మిఠాయి దుకాణానికి వెళ్లి లడ్డూలు, గులాబ్‌జాములు లాగించేవారు. తాను పుట్టిన గడ్డ, చిన్నతనంలో గడిపిన పరిసరాలు, చదువుకున్న స్కూలు,  నోరూరించే మిఠాయిలుండే దుకాణాలు ఇవంటే వాజపేయికి ఎంతో మమకారం. ఆ అనుబంధంతోనే 1984 లోక్‌సభ ఎన్నికల్లో గ్వాలియర్‌ నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవ్‌ రావు సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సొంత గడ్డ తనని ఓడించడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే మరోసారి గ్వాలియర్‌ నుంచి పోటీ చేయడానికి ఆయన సాహసించలేదు. కానీ తరచూ గ్వాలియర్‌ వెళ్లి వస్తూ ఉండేవారు. 2006లో చివరిసారిగా వాజపేయి గ్వాలియర్‌కు వెళ్లారు. అనారోగ్యం కబళించడంతో ఆయన ఆ తర్వాత వెళ్లలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా, చివరి రోజుల్లో వెళ్లలేకపోయినా గ్వాలియర్‌తో అటల్‌జీకున్న అనుబంధం మరువలేనిది.

ఉత్తమ గేయ రచయిత వాజ్‌పేయి
వాజ్‌పేయి కవిత్వం కొత్త చిగుళ్లు తొడుక్కున్న ఆమనిలా ఆహ్లాదాన్ని పంచుతుంది. సహజంగానే సున్నిత మనస్కుడు,  ప్రేమమూర్తి , భావకుడు అయిన వాజ్‌పేయి కలం నుంచి మరువలేని, మరపురాని అద్భుతమైన కవితలెన్నో జాలువారాయి. అలాంటి కవిత్వానికి ఒక సినిమా అవార్డు వస్తుందని ఎవరైనా ఊహించగలరా ? అసలు వాజపేయి కూడా అనుకోలేదు తన కవిత్వానికి ఒక అవార్డు వస్తుందని.. స్క్రీన్‌ అవార్డుల కమిటీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వాజపేయిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. వాజ్‌పేయి కవితల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్నింటిని ఏరి గజల్‌మాస్ట్రో జగిత్‌ సింగ్‌ ఆలపించారు. అవన్నీ నవి దిశ పేరుతో 1999లో ఆల్బమ్‌గా వచ్చాయి. ఈ ఆల్బమ్‌కు 2000 సంవత్సరంలో నాన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఉత్తమ గేయ రచయితగా వాజపేయి అవార్డు దక్కించుకున్నారు. అయితే అప్పుడు వాజ్‌పేయి ప్ర«ధానమంత్రిగా ఊపిరి సలపని పనుల్లో ఉండడంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి అవార్డుని అందజేశారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top