ఆస్కా ఎన్నికల భేరి

ASCA 2018 Elections

నేటితో నామినేషన్ల ముగింపు

రెండు ప్యానళ్ల హోరాహోరీ

తమిళనాడులోని తెలుగువారికి ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా సోషల్, కల్చరల్‌ అసోసియేషన్‌ (ఆస్కా)లో ఎన్నికల భేరి మోగింది. ఈనెల 29వ తేదీన జరగనున్న పోలింగ్‌ కోసం రెండు
ప్యానళ్లలో కసరత్తు మొదలైంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై:  ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలివచ్చి మద్రాసులో స్థిరపడిన కొందరు తెలుగు ప్రముఖులు సాయంవేల కాలక్షేపానికి ఒక క్లబ్‌ ఉంటే బాగుంటుందని తలచారు. పలువురు సినీదిగ్గజాలు, ఇతర పెద్దలు కలుసుకుని సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆంధ్రాక్లబ్‌ను నెలకొల్పారు. అయితే కేవలం మగవారికే పరిమితమైన ఈ క్లబ్‌ కొన్నేళ్ల తరువాత ఆంధ్రా సోషల్, కల్చరల్‌ అసోసియేషన్‌గా మారింది. ఈ మార్పు తరువాత ఆస్కాలో జరిగే కార్యక్రమాలకు కుటుంబ సమేతంగా హాజరవుతూ ఆనందించడం ప్రారంభమైంది.

తొలి దశలో నామమాత్ర రుసుముతో దొరికే ఆస్కా సభ్యత్వం ఇటీవల సాధారణ కుటుంబాలకు అందని ద్రాక్షపండుగా మారింది. ఆస్కాలో సభ్యత్వం అంటే సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం నెలకొనడంతో పాలకవర్గ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రతిసారి గట్టి పోటీ అనివార్యంగా మారింది. గత ఎన్నికల్లో పల్లవ గ్రానైట్స్‌ అధినేత డాక్టర్‌ కే సుబ్బారెడ్డి ప్యానల్‌ మొత్తం గెలుపొంది సంచలన విజయం నమోదైంది. ఆనాటి ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీకి దిగిన సుబ్బారెడ్డిపై పోటీకి ఎవరూ సాహసించలేక పోయారు. దీంతో సుబ్బారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది, కార్యదర్శిగా ఎం చక్రవర్తి గెలుపొందగా రావి సాంబశివరావు ఓడిపోయారు.

కొత్త ప్యానళ్ల కసరత్తు:
ఇదిలా ఉండగా, తాజా ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు ప్యానళ్ల నుంచి ఎంతో పలుకుబడి కలిగిన మహాదిగ్గజాలు రంగంలోకి దిగడం ఎన్నికల్లో వేడిపుట్టిస్తోంది. గత ఎన్నికల్లో కార్యదర్శిగా గెలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం చక్రవర్తి, సంయుక్త కార్యదర్శిగా గెలుపొందిన ప్రముఖ ఆడిటర్‌ జేకే రెడ్డి ఒక ప్యానల్‌ నుంచి అధక్ష, కార్యదర్శులుగా పోటీ చేస్తున్నారు. అలాగే ఆస్కా అధ్యక్షుడిగా అనేకసార్లు గెలుపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ‘కెన్సెస్‌’ గ్రూపు సంస్థల చైర్మన్‌ నరసారెడ్డి అధ్యక్షుడిగా, గతంలో కార్యదర్శిగా పనిచేసిన రావి సాంబశివరావు కార్యదర్శిగా మరో ప్యానల్‌ నుంచి పోటీకి దిగుతున్నారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా ఇరు ప్యానళ్లలోని మిగతా అభ్యర్థుల కోసం శుక్రవారం రాత్రి వరకు కసరత్తు సాగింది.

29న పోలింగ్‌:
గత పాలకవర్గ రెండేళ్ల గడువు ముగిసిపోగా తాజా ఎన్నికల కోసం ఈనెల 4వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైంది. 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా శనివారం (14వ తేదీ)తో నామినేషన్ల గడువు ముగుస్తోంది. 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 19వ తేదీన పోలింగ్‌గా నిర్ణయించారు. ఆఫీస్‌ బేరర్స్‌గా ఆరుగురిని, కమిటీ సభ్యులుగా 9 మందిని, ఆస్కా ట్రస్ట్‌కు మరో 9 మందిని ఎన్నికల్లో ఎన్నుకోనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top