ఆయుష్మాన్‌ భారత్‌తో 10 వేల ఉద్యోగాలు

Around 10000 jobs to be created under National Health Protection Scheme - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌–నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ మిషన్‌ (ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం) పథకం ద్వారా కొత్తగా 10,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు, లబ్ధిదారులకు వివరాలు తెలిపేందుకు సుమారు లక్ష మంది వరకు ఆయుష్మాన్‌ మిత్రలను నియమించనున్నామని చెప్పారు. రోగులకు సహకరిస్తూ ఆస్పత్రికి, లబ్ధిదారుల మధ్య సమన్వయకర్తలుగా ఆయుష్మాన్‌ మిత్రలు వ్యవహరిస్తారని.. పథకం కింద ఎంపికైన ప్రతి ఆస్పత్రిలో వీరు అందుబాటులో ఉంటారని, హెల్ప్‌ డెస్క్‌ నిర్వహిస్తారని వివరించారు. పథకం కింద ఇప్పటికే 20,000 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు ఎంపికయ్యాయని.. లబ్ధిదారులను సామాజిక, ఆర్థిక కుల గణన సర్వే (ఎస్‌ఈసీసీ) ఆధారంగా ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ క్యూఆర్‌ కోడ్స్‌తో కూడిన లేఖను అందజేయనున్నారు. ఆయుష్మాన్‌ మిత్రల కోసం నైపుణ్య అభివృద్ధి శాఖతో ఆరోగ్య శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌తో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top