సరిహద్దుల్లో సైన్యం డేగకన్ను

Army Has Issued a Red Alert On The Supply Of Weapons To Terrorists With The Help of Drones - Sakshi

ఉగ్రవాదుల చొరబాట్లపై రెడ్‌ అలర్ట్‌

పాక్‌ డ్రోన్‌ కనిపిస్తే కూల్చాలని ఆదేశాలు

చొరబాట్ల నిరోధక గ్రిడ్‌ హైఅలర్ట్‌

శ్రీనగర్‌/జమ్మూ: పాక్‌ నుంచి సొరంగాలు, కందకాల ద్వారా అక్రమ చొరబాట్లు, డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులకు ఆయుధ సరఫరా వంటి వాటిపై సైన్యం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తనిఖీలు, నిఘాతో సరిహద్దుల వెంబడి డేగకన్ను వేశాయి. చొరబాట్లను నివారించేందుకు మూడంచెల గ్రిడ్‌ను హై అలర్ట్‌లో ఉంచాలని సైనిక, పరిపాలన యంత్రాంగాలను జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ కోరారు. కశీ్మర్, పంజాబ్‌లలో పాక్‌తో ఉన్న వెయ్యి కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సొరంగాలు, కందకాల ద్వారా సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించేందుకు అవకాశం ఉందన్న అనుమానంతో జవాన్లు భారీగా తనిఖీలు చేపట్టారు. సొరంగాల జాడ కనిపెట్టేందుకు మూడంచెల సరిహద్దు కంచె వెంబడి నిర్ణీత లోతున్న కందకాలు తవ్వి, భూమిని దున్నుతున్నారు.

గత వారం జమ్మూలోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో సైన్యం కళ్లుగప్పి దేశంలోకి ప్రవేశించిన పాక్‌  యువకుడిని సైన్యం పట్టుకుంది. అతడు సరిహద్దుల్లో కంచెను దాటకుండానే చొరబడినట్లు గుర్తించిన సైన్యం..అక్రమ చొరబాట్ల కోసం పాక్‌ ఆర్మీ సరిహద్దుల్లో తవి్వన కందకాలు, సొరంగాల గుండానే అతడు వచ్చి ఉంటాడని అనుమానిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవాన్లు సరిహద్దుల్లో కందకాలు, సొరంగాలను కనిపెట్టేందుకు పంజాబ్, జమ్మూలలో ప్రత్యేక సెన్సార్‌లు, ఆధునిక టెక్నాలజీలతో అణువణువూ తనిఖీలు చేపట్టారు. చీనాబ్‌ నది గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబాట్లను నిలువరించేందుకు నదిలో గస్తీని పెంచింది. భారత గగనతలంలోకి చొరబడే డ్రోన్లను తక్షణమే కూల్చి వేయాలని ఆదేశించింది. సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు పహారాను ముమ్మరం చేసింది.   

కశ్మీర్‌లో ఎన్‌ఎస్‌ఏ దోవల్‌ పర్యటన
పాకిస్తాన్‌ ఆర్మీ ప్రేరేపిత చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో చొరబాటు నిరోధక గ్రిడ్‌ను అప్రమత్తంగా ఉంచాలని, కీలకమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచాలని ఎన్‌ఎస్‌ఏ దోవల్‌ ఆదేశించారు. కశీ్మర్‌ లోయలో ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన శ్రీనగర్‌లో అధికార యంత్రాంగం, భద్రతా అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. పాక్‌ నుంచి భారీగా అక్రమ చొరబాట్లకు అవకాశం ఉందన్న సమాచారంపై ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చొరబాట్ల వ్యతిరేక గ్రిడ్‌ను హైఅలెర్ట్‌లో ఉంచాలని ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ అధికారులను కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top