మూకహత్య: ఉద్ధవ్‌ ఠాక్రేకు అమిత్‌ షా ఫోన్‌

Amit Shah Speaks To Uddhav Thackeray Over Palghar Mob Lynching - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేశారు. గత వారం రాష్ట్రంలోని పాల్గాఢ్‌ జిల్లాలో చోటుచేసుకున్న మూక హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా అమిత్‌ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 100 మందిని అరెస్టు చేశారని తెలిపారు. ‘‘ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో కొంత మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు’’అని హోం మంత్రితో పేర్కొన్నారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య)

కాగా పాల్గాడ్‌ జిల్లాలోని దబాధి ఖన్వేల్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్‌ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్‌ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్‌(35), వారి డ్రైవర్‌ నీలేశ్‌ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో బాధితులకు తప్పక న్యాయం చేస్తామంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన అధినేతకు విజ్ఞప్తి చేశారు.(మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా..: యోగి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top