
50 వేల మంది పోలీసులు.. ఒకేరోజు సెలవు!
పోలీసులకు కోపం వస్తే ఏం చేస్తారు.. లాఠీలు గట్టిగా ఝళిపిస్తారు కదూ. కానీ, కర్ణాటక పోలీసులు మాత్రం ఆ లాఠీలు పక్కన పారేస్తామంటున్నారు.
పోలీసులకు కోపం వస్తే ఏం చేస్తారు.. లాఠీలు గట్టిగా ఝళిపిస్తారు కదూ. కానీ, కర్ణాటక పోలీసులు మాత్రం ఆ లాఠీలు పక్కన పారేస్తామంటున్నారు. క్రమశిక్షణ పేరుతో సీనియర్ అధికారుల వేధింపులు, అరకొర జీతాలు, తగిన సెలవులు లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా జూన్ 4వ తేదీన ఒకరోజు సామూహిక సెలవు పెట్టాలని భావిస్తున్నారు. దాదాపు 50వేల మంది పోలీసులు ఇప్పటికే 'వేధింపుల సెలవు' కావాలని అప్లై చేశారట. అయితే ఆరోజు అసలు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పోలీసు బాస్‌లు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆందోళనకు అఖిల కర్ణాటక పోలీస్ మహాసంఘ నాయకత్వం వహిస్తోంది. కొంతమంది పోలీసులు ముందుగా తమవద్దకు వచ్చి నిరసన తెలపాల్సిందేనని పట్టుబట్టడంతో అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, తర్వాత క్రమంగా ఉద్యమం ఊపందుకుందని ఈ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శశిధర్ తెలిపారు. ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలంటే.. పెద్దసంఖ్యలో అందరూ సెలవులో వెళ్లాల్సిందేనని, అసలు ఇప్పటివరకు పోలీసుల హక్కుల గురించి పోరాడేందుకు తమకు తగిన వేదిక లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో దాదాపు 85వేల మంది పోలీసులు ఉండగా అందులో 65వేల మంది కానిస్టేబుళ్లేనని, వీళ్లనే ఎక్కువగా వేధిస్తున్నారని చెప్పారు.
మంచి జీతాలు కాదు కదా, కనీసం కుటుంబంతో కాలం గడిపేందుకు కూడా కుదరడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవులు ఇవ్వరని, చిన్న చిన్న విషయాలకు కూడా క్రమశిక్షణ పేరుతో సస్పెండ్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా రోజుకు 15 గంటలు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వాలు తమ దుస్థితిని గత 25-30 ఏళ్లుగా పట్టించుకోవడం లేదని, అందుకే నిరసన తెలియజేస్తున్నామని శశిధర్ వివరించారు.