తగ్గని కరోనా ప్రకోపం

29,974 Corona Cases Registered In India - Sakshi

వెయ్యికి దరిదాపులో మరణాలు

ఒక్కరోజులో 51 మంది మృతి.. 1,594 పాజిటివ్‌ కేసులు నమోదు

29,974కు చేరిన మొత్తం కేసులు.. ఇప్పటిదాకా 937 మంది బలి  

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో కరోనా సంబంధిత మరణాల సంఖ్య వెయ్యికి, పాజిటివ్‌ కేసుల సంఖ్య 30 వేలకు చేరుకుంటోంది. ఈ వైరస్‌ బారినపడి సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు.. ఒక్కరోజులో 51 మంది కన్నుమూశారు. అలాగే కొత్తగా 1,594 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా సంబంధిత మరణాలు 937కు, పాజిటివ్‌ కేసులు 29,974కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్‌ కరోనా కేసులు 22,010 కాగా, 7,026 మంది(23.44 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ బాధితుల్లో 111 మంది విదేశీయులు ఉన్నారు.

వ్యాపార రంగాన్ని ఆదుకోవాలి: ఎస్‌.జయశంకర్‌  
కరోనా మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు వ్యాపార రంగానికి సహకారాన్నందించి, ఎవరూ ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చూడాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ చెప్పారు. ఆయన బ్రిక్స్‌ విదేశాంగ శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై, మానవ సంక్షేమంపై ప్రభావం చూపడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఈ మహమ్మారి ప్రభావితం చేస్తోందని, ఫలితంగా ప్రపంచ వాణిజ్యం, వస్తువుల సరఫరాకి తీవ్ర ఆటంకం కలుగుతోందని వెల్లడించారు.

సాయుధ దళాల్లో తొలి మరణం 
కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో తొలి కరోనా మరణం నమోదయింది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్పీఎఫ్‌)కు చెందిన ఎస్‌ఐ స్థాయి అధికారి కోవిడ్‌–19తో మంగళవారం మరణించారని అధికారులు తెలిపారు.  అస్సాంలోని బార్పేటకు చెందిన ఈయన ఇప్పటికే రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారన్నారు. కోవిడ్‌–19తో మరో 31 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

55ఏళ్లు దాటిన పోలీసులకు సెలవులు 
55 ఏళ్లు దాటిన పోలీసులు సెలవులు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల కోవిడ్‌ బారిన ముగ్గురు పోలీసుల్లో ఒకరు మరణించారు. ముగ్గురూ 50 ఏళ్లు దాటిన వారే కావడం గమనార్హం.  కాగా, పోర్టు ఉద్యోగులు విధినిర్వహణలో ఉండగా కరోనా బారినపడి మరణిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధానిలో నీతి ఆయోగ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో నీతి భవన్‌ను 48 గంటల పాటు మూసివేశారు. సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా న్యాయస్థానంలోని 36 మంది భద్రతా సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

సనంద్‌ పారిశ్రామికవాడలో కార్యకలాపాలు
గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సనంద్‌ పారిశ్రామికవాడలో ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయని హోంశాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ  చెప్పారు. ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని అన్నారు.

ప్లాస్మా థెరపీతో నయంపై ఆధారాల్లేవు  
కరోనా వైరస్‌ సోకితే ప్లాస్మా థెరపీతో పూర్తిగా నయమవుతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం తేల్చిచెప్పింది. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కరోనా నివారణకు ఈ థెరపీ పనికొస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. ఈ చికిత్స శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకూ రీసెర్చ్, క్లినికల్‌ ట్రయల్స్‌లో తప్ప ఇతరులు ఉపయోగించడం చట్ట రీత్యా నేరమని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ సాధ్యాసాధ్యాలపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) జాతీయ స్థాయిలో అధ్యయనం నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతానికి కరోనా నుంచి బయటపడడానికి ధ్రువీకరించిన చికిత్సా విధానాలేవీ లేవని తెలిపారు. గతంలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డ 17 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఇతర దేశాల కంటే భారత్‌ ముందంజలో ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌ కంటే ముందు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపు కావడానికి 3 నుంచి 2.25 రోజులు పట్టేదని, ప్రస్తుతం 10.2 రోజులు పడుతోందని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top