‘ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్’

Ys Rajasekhara Reddy Biopic Yatra Special - Sakshi

‘యాత్ర’ YSR బయోపిక్ కాదు, అది తీయడానికి రెండున్నర గంటల సినిమా నిడివి సరిపోదు.  కేవలం ‘పాదయాత్ర’ అంటే, అంతసేపు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడానికి సరుకు చాలదు.  మరేంటి? ఈ ఉత్సుకతతోనే సినిమాకెళ్ళా! ఓపెన్‌ మైండ్‌తో, నిర్మల మనసుతో సాంతం చూశా. ఇంటర్మిషన్‌, ది ఎండ్‌ త్వరగా వచ్చాయి. నడుమ నాలుగయిదు మార్లు కళ్ళు చేమర్చినా, అరె! సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది.
హాట్సాఫ్ టు ది డైరెక్టర్.

చిత్రీకరణ నైపుణ్యమే కాదు సినిమా అంతటా నిజాయితీ ఉంది. అందుకే ఆ నిండుతనం. జనమాధ్యమాల (mass communication) లో సెల్యులాయిడ్, సినిమా ఎంత పవర్ఫుల్లో మరోమారు అర్థమైంది. ‘వైఎస్సార్’ అని పొట్టిగా పిలిచినా, ‘రాజశేఖరరెడ్డి’ అంటూ రాజసం చిలికినా,  ‘డా.వైఎస్సార్‌’ని ఒడలు పులకించేలా పొడుగ్గా పలికినా... నాలుగు దశాబ్దాలు ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్! ఎందుకు? ఎందువల్ల? ఏ కారణంగా?

క్రమంగా వికసించిన ఆయన వ్యక్తిత్వం, తనవారితో మమేకమయ్యే జీవనశైలి, ద్విదృవ మొండి/హుందాతనం, ఊపిరై సహవాసం చేసిన మానవత, జనం కోసం ఏమైనా చేయగల తెగువ... ఇవే, దర్శకుడికి ముడిసరుకయ్యాయి. అందుకే, సంఘటనలు, సన్నివేశాల వరుస మార్చినా, అక్కడక్కడ నిజాలకు సినీమాటిక్ ట్రిక్కులద్దినా... ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీ రిఇంబర్స్మెంట్’,  నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, సాచురేషన్ వరకిచ్చిన ‘పెన్షన్లు’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ణం’ ఇలా, అయిదున్నరేళ్ళు అభివృద్ధి - సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన  దాదాపు అన్ని పథకాలూ.... ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్ దట్సాల్!

కుళ్ళు రాజకీయాల్ని జొప్పించలేదు, ఒకటీ అరా ఆహ్లాదపరిచే సెటైర్లు తప్ప! ‘నటన’ కళ అయితే, అది తప్పక భాషాతీతమని మమ్ముట్టి తన నిండైన రూపం, చాతుర్యం, మ్యానరిజం,  కడకు వాచకం (తనదే డబ్బింగ్)తో నిరూపించాడు.

చివరికి, 
గ్రేట్....
కనబడీ కనబడనీకుండా
కంటతడి తుడిచేసుకుంటారు గనుక,
‘రాజకీయాల్లో ఉంటే వైఎస్సార్ లా ఉండాలి,
‘అధికారం’ అబ్బితే ఆయనలా నడవాలి,
మనిషై మాటిస్తే రాజన్నలా కట్టుబడాలి, 
స్నేహమంటూ చేస్తే అతనిలా విశ్వసించాలి,
ఇవేవీ చేయలేకపోయినా.... 
మనకెప్పటికీ YSR లాంటి పాలకుడుండాలి’ 
అనుకుంటూ,  ప్రేక్షకులంతా
బరువెక్కిన గుండెలతో 
థియేటర్ బయటకు నడుస్తారు.
-దిలీప్ రెడ్డి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top