శింబు, త్రిష, వడివేలుకు నోటీసులు

TFPC send notice to Hero simbu and Trisha - Sakshi - Sakshi

కోట్ల రూపాయల నష్టానికి కారణమైన నటుడు శింబు, వడివేలు, హీరోయిన్‌ త్రిషలకు నిర్మాతల మండలి, నడిగర్‌ సంఘం నోటీసులు జారీ చేసింది. 
శింబు సహకరించలేదు: అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మైఖెల్‌ రాయప్పన్‌ ఆ చిత్ర కథానాయకుడు శింబుపై నిర్మాతల మండలిలో ఇటీవల ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నటుడు శింబు తన చిత్రంలో నటించడానికి పూర్తిగా సహకరించలేదని ఆరోపించారు. చిత్ర షూటింగ్‌ సగ భాగం పూర్తి అయిన తరువాత ఇక నటించను చిత్రీకరించిన దానితోనే చిత్రాన్ని విడుదల చేయమని, మిగిలింది రెండవ భాగంగా విడుదల చేయండి అని అన్నారని తెలిపారు. ఈ కారణంగా తనకు రూ.18 కోట్ల నష్టం వాటిల్లిందని దీనికి సరైన పరిష్కారం చేయాలని కోరారు.

త్రిష హ్యాండిచ్చింది 
విక్రమ్‌ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో సామి–2 చిత్రాన్ని నిర్మిస్తున్న శిబు తమీస్‌ నటి త్రిషపై నడిగర్‌సంఘంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో సామి–2 చిత్రంలో నటించడానికి అంగీకరించిన త్రిష షూటింగ్‌ ప్రారంభమైన తరువాత అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు. దీంతో చిత్ర షూటింగ్‌ రద్దు అయ్యిం దని, త్రిష చిత్రం నుంచి తప్పుకోవడంతో కథను మార్చాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందువల్ల షూటింగ్‌ను కొనసాగించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో తనకు కోట్లలో నష్టం ఏర్పడిందని, ఈ వ్యవహారంపై తగిన న్యాయం చేయాలని కోరారు.

వడివేలుపై ఫిర్యాదు
హాస్య నటుడు వడివేలుపై దర్శకుడు శంకర్‌ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నటుడు వడివేలు హీరోగా హింసైఅరసన్‌ 24వ పులికేసి చిత్రాన్ని నిర్మిస్తున్నానని, ఈ చిత్రంలో నటించడానికి వడివేలు సహకరించడం లేదని పేర్కొన్నారు. చిత్రం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ సెట్స్‌ వేసినట్లు పేర్కొన్నారు. వడివేలు కారణంగా  చిత్ర షూటింగ్‌ కొనసాగక తీవ్ర నష్టం ఏర్పడిందని ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. దీంతో ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు నిర్మాతల మండలి కార్యదర్శి జ్ఞానవేల్‌ రాజా తెలిపారు. ఇదిలా ఉంటే నటి అమలాపాల్‌పై కారు కొనుగోలు పన్ను మోసం వ్యవహారంలో కేరళ రాష్ట్ర మెట్రో వాహన శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top