ఆ కల నెరవేరలేదు : రంగనాథ్

ఆ కల నెరవేరలేదు : రంగనాథ్


 (2014లో రంగనాథ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుంచి... కొంత భాగం)


రంగనాథ్

జననం :1949

మరణం :19-12-2015




 సినిమాల్లోకి రాకముందు మీరు రైల్వే ఉద్యోగి. బంగారం లాంటి ఉద్యోగం రిజైన్ చేసి వచ్చానని ఎప్పుడైనా ఫీలయ్యారా?

 నేనసలు రిజైన్ చేయలేదు. ‘రిజైన్ చేస్తే మళ్లీ నిన్ను ఉద్యోగంలో తీసుకోరు’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో రిజైన్ చేయకుండానే సినిమాలు చేస్తూ వచ్చా. అయితే ఆఫీస్ నుంచి లెటర్లు వస్తుండేవి. చివరకు ‘నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయకూడదు’ అని ఓ ఉత్తరం వచ్చింది. అప్పుడు ఉద్యోగానికి మంగళం పలికాను. నాకంత ధైర్యం రావడానికి కారణం... అప్పటికే నాకు నాలుగైదు హిట్లు వచ్చేశాయి.

 

 మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు?

 మూడొందలకు పైచిలుకే. అందులో 60 సినిమాల్లో హీరోగా చేశాను.

 

 ఒకప్పుడు మీరు రొమాంటిక్ హీరో కదా. అప్పట్లో ఏమైనా ప్రపోజల్స్ వచ్చేవా?

 ఆ ఛాన్స్ లేదు. నాకు అప్పటికే పెళ్లయిపోయి, పిల్లలు కూడా పుట్టేశారు. అలా కాకపోతే మీరన్నట్లు ప్రపోజల్స్ వచ్చేవేమో! క్యారెక్టర్ ఆర్టిస్టుగా విరివిగా సినిమాలు చేస్తునప్పుడు ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది. షూటింగ్ పని మీద మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓ గుళ్లో షూటింగ్. పేకప్ చెప్పేశారు. గబగబా కారెక్కి వెళ్లబోతున్నాను. అంతలో ‘రంగనాథ్‌గారూ’ అనే పిలుపు వినబడింది. ఓ మధ్యవయస్కురాలు పరుగు లాంటి నడకతో వచ్చింది. ‘ఎన్నాళ్లకు చూశానండీ’ అని ఉద్వేగానికి లోనైంది. ఆమె కంటి నిండా నీరు. ఆమె పక్కనే చిన్న పాప ఉంది. ‘అమ్మమ్మా! వెళ్దాం పదా’ అంటోంది. అంటే అప్పటికే ఆమె అమ్మమ్మ అయిపోయిందన్నమాట. నేను హీరోగా చేస్తున్న రోజుల్లో ఆమె నా అభిమాని అని అర్థం చేసుకున్నా. ‘ఆటోగ్రాఫ్’ అంది. పెన్  తీసి, ‘కాగితం ఏది’ అన్నాను. ‘నా చేతి మీద పెట్టండి’ అంది. ఇప్పటికీ నన్ను ఇంతలా అభిమానించేవారున్నారా అని నాకు ఆశ్చర్యమేసింది. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది.

 

 అసలు మీలో సాహిత్యాభిమానం ఎలా మొదలైంది?

 ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే రోజుల్లో... మా తెలుగు మాస్టారు శబ్దాలంకారంలో పోతన రాసిన ‘అడిగెదనని కడువడిజను’ పద్యం చెబుతు న్నారు. ఇదేదో బాగుందే అనిపించింది. వెంటనే అదే పంథాలో ‘అత్తగారి పెత్తనంబు... నెత్తిమీద నొత్తుచుండ, తత్తరిల్లి బిత్తరిల్లి, చెంతనున్న కత్తినెత్తి.. నెత్తిమీద మొత్త చూచె.. కొత్తనైన కొడలమ్మి’ అని రాసిచ్చాను. అందరూ మెచ్చుకున్నారు. నాలో అంతర్లీనంగా తెలీని ప్రతిభ ఏదో దాగుందని అప్పుడే అర్థమైంది. తర్వాత గేయాలు రాశాను, కథలు రాశాను. సినిమా ఇండస్రీ ్టకొచ్చాక ‘రత్తాలు రాంబాబు’ షూటింగ్‌కి బెంగళూరు వెళ్లా. అక్కడ నుంచి  నటి జయంతి గారి మేకప్‌మేన్ రాజగోపాల్‌గారితో పరిచయమేర్పడింది. ఇద్దరం కారులో వెళ్తుంటే శ్మశానంపై రాసిన ఓ హిందీ పాట పెట్టుకొని ఇన్వాల్వ్ అయిపోయి మరీ వింటున్నాడాయన. ‘ఏంటని’ అడిగాను. సాహిత్యంలోని ఆ సొగసు హిందీ పాటల్లోనే ఉంటుందని, మన పాటలు ఎందుకూ పనికిరావని అన్నాడు ఉద్వేగంతో. తెలుగు సాహిత్యంలో సొగసు ఉండదని అనగానే... నాకు కోపం నషాళానికి అంటింది. ఇంటికి వెళ్లగానే అదే శ్మశానంపై ‘పిలుస్తోంది.. పిలుస్తోంది, వల్లకాడు పిలుస్తోంది’ అంటూ ఎనిమిది పేజీల కవిత రాశాను. తీసుకెళ్లి అతనికి వినిపించాను. తెలుగు సాహిత్యాన్ని కించపరచొద్దని గట్టిగా చెప్పాను. తను కూడా తప్పు ఒప్పుకున్నాడు. మళ్లీ ఆయనే ప్రోత్సహించడంతో మరో రెండు పుస్తకాలు రాశాను. నేను రాసిన పుస్తకాలు బయటకు రావడానికి కారణం మాత్రం హీరో చిరంజీవే. పుస్తకాలు తీసుకురమ్మని విపరీతంగా బలవంతం చేశాడు. దాంతో నాలుగు పుస్తకాలు విడుదల చేశాను. నా స్క్రిప్ట్‌తో, శివాజీరాజా హీరోగా డెరైక్ట్ చేసిన ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ చిత్రంలో 2 పాటలు కూడా రాశా.

 

 మీ సీనియర్స్‌లో మీకు ఎవరంటే ఇష్టం?

 నేను అక్కినేని అభిమానిని. ఆయనతో పాటు ఎన్టీయార్ ఎలానూ  ఉంటారు. వారిద్దరూ తెలుగు సినిమాకు నరనారాయణులు. చిన్నప్పుడు యాక్షన్ సినిమాలు బాగా చూసేవాణ్ణి. అప్పుడు ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో. కళాశాలకు వెళ్లాక... ప్రేమకథల్ని ఇష్టపడటం మొదలుపెట్టా. అలా.. ఏఎన్నార్ ఫ్యాన్‌గా మారాను. నాటకాలు వేస్తున్న రోజుల్లో... స్టేజ్ మీద అచ్చం అక్కినేనిగారిలా నటించేవాణ్ణి. హీరో అయ్యాక కూడా కొన్నాళ్లు ఆ ప్రభావం పోలేదు. తర్వాత్తర్వాత నాకంటూ ఓ స్టయిల్ అలవరుచుకున్నాను.

 

 ఆర్టిస్టుగా డ్రీమ్ కేరక్టర్ ఏదైనా ఉందా?

 రావణాసురుడి పాత్ర చేయాలని ఎదురు చూశా. కానీ ఆ కల నెరవేరలేదు. ఇప్పుడొచ్చినా చేయలేని పరిస్థితి. ఎందుకంటే దానికి తగ్గ బాడీ లేదు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top