‘సామజవరగమన’ను కాదనగలమా!?

Samajavaragamana Song Parody Video Goes Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠాపురంలో’ సినిమాలోని  ‘సామజవరగమన నిను చూసి ఆగగలనా!’ అనే పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాట నచ్చిన వారితోపాటు పాట మెచ్చని వారు కూడా ఈ పాటకు పారడీలు కట్టి మరీ పాడుతున్నారు. సోషల్‌ మీడియాను ఊపుతున్నారు. (సామజవరగమన పాట అలా పుట్టింది..)

‘సామజవరగమన ఇంత షాపింగ్‌ నీకు తగునా! కట్టుకున్న మొగడినే కనికరించే లలనా!’ అంటూ ఒకరు, ‘సామజవరగమనా ఓ భర్త నీకు తగునా! అంటూ మరొకరు మాటల కూర్పుతో నవ్విస్తున్నారు. ఏడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుహన రాజకీయాల గురించి ‘నీ కళ్లకు ఇంకా మాయరోగం పోనే లేదంటా, ఆ చూపులకింక పచ్చ కామెర్లు పోవా ఇక అసలు!’ అంటూ వ్యంగోక్తులు విసురుతున్న వారూ ఉన్నారు. త్యాగరాజ కృతి ‘సామజవరగమన’ను ఇలా అవమానిస్తారా ? మీకు పోయే కాలం వచ్చిందీ’ అంటూ శాపనార్థాలు పెడుతున్న సనాతన వాదులు లేకపోలేదు. వారిలో కూడా ‘ఇది శ్రీకృష్ణుడి గురించి పాడారు’ అని కొందరంటే ‘లేదు శ్రీరాముడి గురించి పాడారు’ అంటూ మరికొందరు వాదులాడుకుంటున్నారు. ఎవరి గురించి పాడినా ‘సామజవరగమన’ అంటే తెలుగులో మాత్రం ‘ఏనుగులా గాంభీర్యంగా నడచివొస్తున్నా’ అని అర్థం. మొత్తం సంస్కృతంలో త్యాగరాజ కృతి నుంచి ‘సామజవరగమన’ అన్న ఒక్క పదాన్ని మాత్రమే పాట పల్లవిగా తీసుకున్నారు.

త్యాగరాజు కృతి ‘సామజవరగమన’ పాటను హిందోళ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడడం ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2013లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమాలో ఎస్‌ జానకి ఈ పాటను పాడడం ద్వారా మరో తరానికి పరిచయం చేశారు. కొంత సినిమా టిక్‌గా పాడనన్న పశ్చాత్తాప భావంతో ఆమె ఆ తర్వాత ఈ పాట సహ పలు త్యాగరాజ కీర్తనలను పాడి ప్రైవేట్‌ ఆల్బమ్‌గా విడుదల చేశారు. గాన గాంధర్వుడు ఘంటసాల 1971, డిసెంబర్‌లో అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో సంగీత కచేరి ఇచ్చినప్పుడు అక్కడి శ్రోతల డిమాండ్‌ మేరకు ‘సామజవరగమన’ త్యాగరాజ కృతిని పాడారు. తమిళనాడులోని తిర్పూర్‌లో కూడా ఆయన ఓసారి పాడిన రికార్డు ఉంది. బాల మురళి, ఎస్‌. జానకి, ఘంటసాల గాన మాధుర్యాన్ని అమితంగా ఆస్వాదించే శ్రోతలు, కొత్త పాట అర్థంపర్థంలేని పదాల కూర్పు కుప్పని, రాగాలాపన కూడా లేని కూని రాగమని విమర్శిస్తున్నన్నారు. ఎవరేమన్నా, అనుకున్నా నేటి కుర్రకారును కుదిపేస్తున్న ‘సామజవరగమన’ను కాదనగలమా! అని ఆ మీడియాలో మనగలమా!?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top