‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’ | Sakshi Interview Vithika Sheru About Bigboss 3 Journey | Sakshi
Sakshi News home page

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

Oct 29 2019 10:08 AM | Updated on Oct 31 2019 10:44 AM

Sakshi Interview Vithika Sheru About Bigboss 3 Journey

బిగ్‌బాస్‌ సీజన్‌– 3 విజేతగా తన భర్త వరుణ్‌ సందేశ్‌ నిలుస్తారని, తనకు ఆ నమ్మకం బాగా ఉందని ఆయన భార్య, గత వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వచ్చిన వితికా శేరు అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అనంతరం ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకు ఓపిక బాగా అబ్బిందని కుదురుగా ఉండటం నేర్చుకున్నానని చెప్పారు.టాస్క్‌లలో నాకంటే వరుణ్‌ బాగా ఆడేవారు.

అయితే వరుణ్‌ సోలోగా ఆడడానికే ఇష్టపడుతున్నట్లుగా ప్రేక్షకులు చెప్పారు. అందుకే నేను ఎలిమినేట్‌ అయ్యాను. ఏదైనా చేయగలననే పట్టుదల కూడా వచ్చిందన్నారు. లగ్జరీ లేకుండా ఒకరి సహాయం తీసుకోకుండా గూగుల్‌తో సంబంధం లేకుండా బతకవచ్చు అనే నమ్మకం ఈ 90 రోజుల బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాతో పాటు వరుణ్‌ కూడా తెలుసుకున్నారన్నారు. ఇందులో మైండ్‌తో ఆడేదే ఎక్కువగా ఉంటుందని, అందుకే తన విజ్ఞానం కూడా బాగా పెరిగిందన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో సభ్యులందరూ తనకు ఇష్టమైనవారేనని.. నచ్చని విషయమంటూ ఉందంటే అది రాళ్లు, రత్నాలు టాస్క్‌లో జరిగిన ఘటనేనని ఆమె తెలిపారు.  

వంటలు బాగా చేస్తా...      
బిగ్‌బాస్‌ హౌస్‌లో బాగా వంటలు చేయడంలో నాకు నేనే సాటిగా నిరూపించుకున్నాను. ఆరు వారాల పాటు కిచెన్‌ కెప్టెన్‌గా కొనసాగాను. నా వంటలను ఇతర సభ్యులతోపాటు వరుణ్‌ కూడా బాగా మెచ్చుకునేవారు.  

రూ.50 లక్షలు వస్తే...  
ఫైనల్‌లో వరుణ్‌ విజేతగా నిలిచి రూ.50 లక్షలు బహుమతిగా తీసుకొని వస్తే వాటిని భద్రంగా దాచుకుంటాను. మేం పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. డబ్బులు లేకపోతే ఎంత చులకనగా చూస్తారో చవిచూశాం. అలాంటి పరిస్థితి రాకుండా.. ఈ వచ్చిన డబ్బును ఫిక్స్‌డ్‌ చేసుకుందామనుకుంటున్నాం. 

ఫైనల్‌లో ఆ ముగ్గురు ఉండొచ్చు..    
వచ్చే నెల 3న జరగనున్న బిగ్‌బాస్‌–3 ఫైనల్‌ టాప్‌–3లో మా వారు వరుణ్‌ సందేశ్‌తో పాటు శ్రీముఖి, రాహుల్‌ ఉంటారేమో. తెలుగింటి ఆడపడుచుగా, ఒక భార్యగా మావారు వరుణ్‌సందేశ్‌ విజేతగా తిరిగి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు.  13 వారాల పాటు భార్యాభర్తలిద్దరం బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగడానికి ప్రేక్షకులతో పాటు సహచర సభ్యులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు.  

మంచి మిత్రులం..  
బిగ్‌బాస్‌ హౌస్‌లోవరుణ్‌తో పాటు నేను, పునర్నవి, రాహుల్‌ మంచి స్నేహితులం. కష్టాల్లో, ఇష్టాల్లో నలుగురం పాలుపంచుకున్నాం. వరుణ్‌ తర్వాత వాళ్లిద్దరూ నన్ను ఎంతగానో ప్రేమించేవారు. 

ఎక్కువగా ఇంటి గురించే..  
మేమిద్దరం ఒంటరిగా హౌస్‌లో కూర్చున్నప్పుడు ఇంటి గురించే ఆలోచించుకునేవాళ్లం. మా ఇంట్లో అమ్మకు, వరుణ్‌ ఇంట్లో బామ్మ, తాతయ్యకు ఆర్థిక అవసరాలు తీర్చేది మేమిద్దరమే. ఆర్థిక పరిస్థితులను చూసుకునే ఇద్దరం హౌస్‌లోనే ఉండటం వల్ల అక్కడ వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారని తల్లడిల్లిపోయేవాళ్లం. ఇద్దరికి టెన్షన్‌గానే ఉండేది.  

మాది ప్రేమ వివాహం..  
నేను మొదటి సినిమా కన్నడలో చేశా. 17 ఏళ్ల వయసులోప్రేమ–ఇష్క్‌–కాదల్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించాను. 2014లో వరుణ్‌ హీరోగా వచ్చిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆయనతో ప్రేమలో పడ్డాను. 2016 ఆగస్టు 19న మా ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. 

 250 డ్రెస్‌లు మార్చా..  
బిగ్‌బాస్‌– 3లో నన్ను అందంగా చూపించడానికి, టాస్క్‌లలో నా ఆటకు తగిన డ్రెస్‌లు రూపకల్పన చేయడానికి ముగ్గురు డిజైనర్లు పని చేశారు. రోజుకు మూడు డ్రెస్‌లు మార్చేదాన్ని. మొత్తం 250 డ్రెస్‌లు మార్చాను. ముఖ్యంగా నాకు చీరలంటే బాగా ఇష్టం. 

మా బంధం..  దృఢమైంది  
హౌస్‌లో వరుణ్‌కు నాకు మధ్యన భార్యాభర్తల అనుబంధం మరింతగా పెరిగింది. ఆయన ఓపెన్‌ మైండెడ్‌గా ఉండేవారు. నిజాయతీ కనిపించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని దాటగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇద్దరం బాగా అర్థం చేసుకున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement