
గణేశ్, రష్మికమండన్నా
‘ఛలో, గీత గోవిందం, దేవదాస్’... వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు రష్మికా మండన్నా. ఆమె నటించిన తాజా చిత్రం ‘గీతా–ఛలో’ ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దివాకర్ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్ – మూవీమ్యాక్స్ బ్యానర్లపై మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రష్మిక నటించిన మరో అద్భుత చిత్రమిది. ఈ నెల 17న ఆడియో రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ 21న వైజాగ్‌లో ప్రీ–రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నాం.
యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్ చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. చిత్ర సమర్పకుడు దివాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది 100 రోజులు గడిచాయి. 50 సినిమాలు విడుదలైతే సక్సెస్ 1శాతం మాత్రమే ఉంది. పరిశ్రమ స్లంప్‌లో ఉంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్ల పరిస్థితి అయోమయంలో ఉంది. పరిశ్రమకు మంచి హిట్ అవసరం. ‘ఛలో, గీతగోవిందం’తో చక్కని విజయాలను అందుకున్న రష్మిక ‘గీతా–ఛలో’తో మరో హిట్ అందుకోబోతోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ముత్యాల రాందాసు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.