ఇంత జరుగుతున్నా పట్టించుకోరా?

R Krishnaiah Warns Telugu Heros - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ మహిళా ఆర్టిస్టుల డిమాండ్లకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలుగు వారికే 90శాతం అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాస్టింగ్‌ కౌచ్‌, కోఆర్డినేటర్ల విధానాన్ని రద్దు చేసి తమకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జూనియర్‌ ఆర్టిస్టులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఫ్యూడల్ వ్యవస్థను గుర్తుకు తెస్తోందన్నారు.

‘సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శంగా నిలవాలి. సినీ పరిశ్రమ పట్ల సమాజంలో గౌరవం పోతుంది. మొన్న మాదకద్రవ్యాల ముద్ర, ఇప్పుడు లైంగిక వేధింపుల ముద్ర సినిమా ఇండస్ట్రీపై పడింది. చిత్ర పరిశ్రమ నాగరిక విలువలకు కట్టుబడి ఉండాలి. ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. వేధింపులకు పాల్పడ్డ వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేయాల’ని కోదండరాం అన్నారు.

తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇవ్వకుంటే వాటిని బలవంతంగా లాక్కుమంటామని బీసీ నాయకుడు ఆర్‌. కృష్ణయ్య హెచ్చరించారు. సినీ పరిశ్రమ తిరోగమన దిశగా వెళ్తోందని విమర్శించారు. సినీ పరిశ్రమలో తమకు రక్షణ కరువైందని మహిళా ఆర్టిస్టులు వాపోయారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, వేషాలు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు చెందిన అపూర్వ, శ్రీరెడ్డితో పాటు పలువురు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top