మళ్ళీ సీక్వెల్ కూడానా?
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’కు సీక్వెల్ వస్తోందా? ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. త్రీడీ మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్‌కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో ‘కోచ్చడయాన్’కు ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. ‘‘పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్‌లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా.
ఏమైనా, దీనికి సీక్వెల్‌లో మరింత కష్టపడి, బాగా తీస్తాం’’ అని మురళీ మనోహర్ అన్నారు. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం ఏమిటంటే, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా, ఈ సహ నిర్మాత మాత్రం ఘన విజయం సాధించిందంటూ డబ్బా కొట్టుకున్నారు. అనుకున్న దాని కన్నా ఆలస్యమైనా, హిందీలో కూడా ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కబుర్లు విని, సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవును మరి... మొదటి సినిమాకే దిక్కు లేదంటూ ఉంటే, దీనికి సీక్వెల్ కూడానా అని పెదవి విరుస్తున్నారు.