నేనే పీఎం అయితే, వాళ్లను ఉరితీసేవాణ్ణి! | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 7 2018 9:31 AM

Kapil Sharma Abuses Media, says Salman is a Good Man - Sakshi

సాక్షి, ముంబై: కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సల్మాన్‌ భాయ్‌కి విధించిన శిక్ష చాలా కఠినమైనదని, ఇప్పటికే ఆయన జీవితంలో ఎన్నో అనుభవించాడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌ చేసిన ఎన్నో మానవతా సేవా కార్యక్రమాలను గుర్తించాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్‌ కపిల్‌శర్మ కూడా సల్మాన్‌ మద్దతుగా ముందుకొచ్చాడు. సల్మాన్‌ చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించకుండా అతనికి న్యాయవ్యవస్థ తీవ్ర విధించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘నేను ఎంతోమంది బడాబాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనేవాళ్లు. వాళ్లను నేను కలిశాను. సల్మాన్‌ మంచి వ్యక్తి. ఆయన ప్రజలకు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఆ తప్పు చేశారో లేదా తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు’ అంటూ కపిల్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. ఆ వెంటనే నకిలీ, వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తుందంటూ మరో ట్వీట్‌లో మీడియాపై మండిపడ్డారు. ‘మీ పేపర్లు అమ్ముకునేందుకు నెగిటివ్‌ కథనాలు రాయకండి. అతను మంచి వ్యక్తి. త్వరలోనే జైలునుంచి బయటకు వస్తాడు. ఎంతో పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా మీరు మాట్లాడారు. నెగిటివ్‌ వార్తలు ప్రచారం చేసేందుకు ఎంతో తీసుకుంటారు’ అంటూ ఓ వెబ్‌సైట్‌ను ఉద్దేశించి దుర్భాషలాడారు. ‘చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేస్‌న్యూస్‌ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని’ అంటూ కపిల్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత తన ట్వీట్లపై విమర్శలు రావడంతో ఆయన వాటిని డిలీట్‌ చేశారు. ఆ ట్వీట్లను పట్టించుకోవద్దని, తన అకౌంట్‌ను హ్యాక్‌ చేశారని మరో ట్వీట్‌లో కపిల్‌ శర్మ తెలిపాడు. ఈ ట్వీ‍ట్ల వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఆ ట్వీట్‌ను కూడా కపిల్‌ శర్మ తొలగించడం గమనార్హం.


 

Advertisement
Advertisement