సెక్స్ స్కాండల్‌.. షాక్‌ మీద షాక్‌ | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ కమిటీ నుంచి హర్వేకు ఉద్వాసన

Published Sun, Oct 15 2017 11:22 AM

Harvey Weinstein expelled from Oscars Academy - Sakshi

సాక్షి : హాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్న హర్వే వెయిన్‌స్టెన్‌ లైంగిక వేధింపుల ఆరోపణ పర్వం తారాస్థాయికి చేరుకుంది. మూవీ మొఘల్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో సోషల్‌ మీడియాలో ఉద్యమం ఊపందుకుంది . తనకేం పాపం తెలీదని హర్వే బుకాయిస్తున్ననప్పటికీ.. వరుసబెట్టి నటీమణులు ఆయన వ్యవహారాలను వెలుగులోకి తెస్తుండటంతో ఆ సీనియర్ మేకర్‌ చుట్టూ గట్టి ఉచ్చు బిగుస్తోంది. 

ఇది చాలదన్నట్లు వరుసగా షాక్‌ల మీద షాకులు హర్వేకు తగులుతున్నాయి. ఆస్కార్‌ కమిటీ నుంచి అతన్ని వెలివేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. హామ్‌ హంక్స్‌, వూపి గోల్డ్‌బర్గ్‌, స్టీవెన్‌ స్పీల్ బర్గ్‌ వంటి దిగ్గజాలు ఉన్న 54 మందితో కూడిన ఆస్కార్‌ కమిటీ శనివారం ఓ ప్రకటన వెలువరించింది. ‘ హర్వేపై గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వారి వల్ల ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డపేరు వచ్చి పడుతోంది. అందుకే ఆయనను కొనసాగించటం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాం. ఇది మిగతా వారికి ఓ గుణపాఠం కావాలి’ అని సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. దీనిని న్యూయార్క్‌ టైమ్స్ పత్రిక అధికారికంగా ధృవీకరించింది. హర్వే అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్‌అండ్‌ సైన్సెస్‌ కమిటీ సభ్యుడిగా ఉండేవాడు.

కాగా, హర్వే యవ్వారాలు వెలుగులోకి వస్తుండటంతో అతన్ని వెయిన్‌స్టెన్‌ కంపెనీ నుంచి వెలివేస్తున్నట్లు సోదరుడు బాబ్‌ వెయిస్టెన్‌ ప్రకటించాడు. తన సోదరుడు ఓ మృగమంటూ బాబ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో హర్వే ఆరోపణల నేపథ్యంలో వెయిన్‌స్టెన్‌ కంపెనీని అమ్మబోతున్నట్లు వస్తున్న వార్తలను బాబ్‌ కొట్టి పడేశారు.  హీరోయిన్‌ సోఫీ దీక్ష్‌తో హర్వే అకృత్యాలను వెలుగులోకి తీసుకురాగా.. అప్పటి నుంచి ఒక్కో హీరోయిన్‌ తమకు ఎదురైన అనుభవాల గురించి వివరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement