వెలుగులోకి మరో వేధింపు.. ఇంకా ఎన్నో?

Broken Anurag Kashyap - With Vikramaditya Motwani, Phantom Company Closes - Sakshi

ఫాంథమ్‌ ఫిల్మ్స్‌.. బాలీవుడ్‌లో భారీ ప్రొడక్షన్‌ హౌస్‌. బాలీవుడ్‌ దర్శకులు అనురాగ్‌ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, వికాస్‌ బాల్, నిర్మాత మధు మంతెన కలసి స్థాపించిన నిర్మాణ సంస్థ. 2011లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కారణం ఈ ప్రొడక్షన్‌ హౌస్‌లో ఒకరైన వికాస్‌ బాల్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడమే. నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసినట్టే బాలీవుడ్‌ దర్శకుడు వికాస్‌ బాల్‌పై కూడా ఓ మహిళ ఆరోపణలు చేశారు. ఇది కూడా పై కేస్‌లానే ఎప్పటిదో. మళ్లీ వెలుగులోకి  వచ్చింది. 

ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘క్వీన్‌’ని తెరకెక్కించిన దర్శకుడు వికాస్‌. ఫాంథమ్‌ ఫిల్మ్స్‌ తీసిన ‘బాంబే వెల్వెట్‌’ సినిమాకు కెమెరా వెనక పని చేసిన ఓ మహిళ వేధింపులకు గురయ్యానని ఆరోపించారు. 2015 మేలో ఈ ఘటన జరిగిందట. ఈ సినిమా ప్రమోషన్స్‌ అప్పుడు వికాస్‌ తనతో తప్పుగా ప్రవర్తించాడని పేర్కొన్నారామె. అప్పట్లో అనురాగ్‌ కశ్యప్‌తో ఈ విషయం చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదం చెలరేగడంతో అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు.

‘‘జరిగింది తప్పే. మేం సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయాం. వికాస్‌ బాల్‌ చేసింది చాలా పొరబాటు’’ అని రెండురోజుల క్రితం బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో పేర్కొన్నారట. ఆ వెంటనే ‘‘ఫాంథమ్‌ మా కల. కలలు కూడా కొన్ని సార్లు ముగింపుకు చేరుకుంటాయి. మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాం. గెలిచాం, ఓడాం. ఇందులోని ఎవరి ప్రయాణం వాళ్లు సొంతంగా సాగిద్దాం అనుకుంటున్నాం. మా అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అంటూ ఫాంథమ్‌ సంస్థను రద్దు చేస్తున్నాం అని అనురాగ్‌ పేర్కొన్నారు.

‘క్వీన్‌’లో నటించిన కంగనా ఆ చిత్రదర్శకుడు వికాస్‌ బాల్‌ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం ఉండి ఉండొచ్చన్నారు. ‘‘బాల్‌కి 2014లోనే పెళ్లయింది. కాని రోజుకో కొత్త పార్ట్‌నర్‌ కావాలన్నట్లు మాట్లాడేవాడు. సెట్లో క్యాజువల్‌గా గట్టిగా హగ్‌ చేసుకుని, నీ జుట్టు సువాసన బావుంటుంది అనేవాడు. ఆ కౌగిలి నుంచి తప్పించుకోవడానికి చాలా ధైర్యం కూడదీసుకునేదాన్ని. నేనా అమ్మాయి ఆరోపణలు నమ్ముతున్నా. ఆమెను సపోర్ట్‌ చేశానని నాకోసం తెచ్చిన స్క్రిప్ట్‌ గురించి మళ్లీ మాట్లాడటం లేదు’’ అని ఘాటుగా స్పందించారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top