బయో పీక్స్‌

bollybood cpice biopics - Sakshi

► పద్మావత్‌కి అక్కడ దారి ఉందా?
చరిత్రలో ఖ్యాతి గాంచిన రాణుల్లో రాణి పద్మావతి ఒకరు. ఆమె జీవితం ఆధారంగానే సంజయ్‌ లీలా భన్సాలీ ‘పద్మావత్‌’ చిత్రాన్ని తెరకెక్కించారని బాలీవుడ్‌ టాక్‌. దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్‌ చేయనున్నారు. అయితే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రిలీజ్‌కు అభ్యంతరం తెలిపాయి. దీంతో చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్‌18 సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పరిశీలనకు అంగీకరించింది.

► బయోపిక్స్‌ క్రేజ్‌ పీక్స్‌కి చేరింది.
బాక్సింగ్‌ రింగ్‌లో మేరీ కోమ్‌ పిడిగుద్దులు గుద్దుతుంటే... లేడీ లైన్‌ అని, చప్పట్లు కొట్టారు. ఈ లేడీ లైన్‌ బాక్సర్‌గా రాణించడానికి చాలా కష్టాలు పడ్డారు. అందుకే మేరీ కోమ్‌ స్టోరీతో సినిమా తీస్తే... ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’... సిల్క్‌ సిత్మ రింగు రింగులు తిరుగుతూ డ్యాన్స్‌ చేస్తుంటే సిక్స్‌టీ ప్లస్‌ ఏజ్‌ ఉన్న హార్టులు కూడా స్వీట్‌ సిక్స్‌టీ అయిపోయాయి. అందుకే ఆమె లైఫ్‌ స్టోరీతో ‘డర్టీ పిక్చర్‌’ తీస్తే ఎగబడి చూశారు.

గ్రౌండ్‌లో ధోని రన్నుల మీద రన్నులు పీకుతుంటే... ఈ రేంజ్‌లో ఆడటానికి ఏ రేంజ్‌లో కష్టపడ్డాడు? ఇతగాడి బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలియాల్సిందే అనుకున్నారు. అందుకే ధోని జీవితకథతో తీసిన ‘ఎం.ఎస్‌.ధోని’ హిట్‌. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌ స్క్రీన్‌పై మెరిసిన ‘బయోపిక్స్‌’ ఎన్నో. ఈ నిజ జీవిత కథలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే రెండు మూడేళ్లుగా హిందీలో బయోపిక్స్‌ హవా సాగుతోంది. ఈ ఏడాదైతే మినిమమ్‌ పది నిజజీవిత కథలు రీల్‌కి వచ్చే అవకాశం ఉంది. ఆ రియల్‌ స్టోరీస్‌ ఏంటంటే...

► ట్రిపుల్‌ ధమాకా
కిలాడీ కుమార్‌... బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ని అలానే అంటారు. ఎందుకంటే సినిమాల సెలెక్షన్‌ విషయంలో అక్షయ్‌ భలే కిలాడీ. అది నిజమే. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేస్తుంటారు. సోషల్‌ మెసేజ్‌ ఉన్న ‘ప్యాడ్‌మేన్‌’ లాంటి సినిమా అంటే చాలు.. ‘సై’ అంటారు. అరుణాచలమ్‌ మురుగనాథమ్‌ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే ‘శానిటరీ నేప్‌కిన్‌’లు తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆయన కథతో తీసిన సినిమానే ‘ప్యాడ్‌మేన్‌’. ఆర్‌. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షయ్‌ భార్య, మాజీ కథానాయిక ట్వింకిల్‌ ఖన్నా నిర్మాతగా మారారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. అక్షయ్‌లాంటి మాస్‌ హీరో ఈ సినిమా చేయడం గ్రేట్‌. ఈ ఒక్క బయోపిక్‌లోనే  కాదు.. ఈ ఏడాది మరో రెండు నిజజీవిత కథల్లో కనిపించి, ట్రిపుల్‌ ధమాకా ఇవ్వనున్నారు. అవేంటంటే...

► గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌లో గోల్డ్‌
లాస్ట్‌ ఇయర్‌ అక్షయ్‌కుమార్‌ గోల్డెన్‌ జూబ్లి ఇయర్‌లోకి ఎంటరయ్యారు. అంటే.. ఆయన వయసు 50. గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌లో అక్షయ్‌ ‘గోల్డ్‌’ పేరుతో సినిమా చేయడం విశేషం. గతేడాదే షూటింగ్‌ పూర్తయింది. హాకీ ప్లేయర్‌ బల్బీర్‌ సింగ్‌ జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్‌ రీమా కగ్తి దర్శకత్వంలో ఈ సినిమాని ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన టీమ్‌లో బల్బీర్‌ సింగ్‌ ఒకరు. ఆయన కథతోనే ‘గోల్డ్‌’ తీశారు. ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

► గుల్షన్‌ జీవిత కథలో...
ఢిలీల్లో పండ్ల దుకాణంలో పని చేసిన గుల్షన్‌ కుమార్‌ చౌకగా ఆడియో కేసెట్లు అమ్మే దుకాణం కొని, చిన్నగా మొదలై, సంగీత ప్రపంచంలో పెద్దగా ఎదిగారు. టీ–సిరీస్‌ మ్యూజిక్‌ లేబుల్‌ వ్యస్థాపకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ‘మొఘల్‌’ చిత్రంలో గుల్షన్‌ కుమార్‌ పాత్ర చేయబోతున్నారు అక్షయ్‌. 1997లో గుల్షన్‌ హత్యకు గురయ్యా రు. తొలినాళ్లల్లో ఆయన పడ్డ కష్టాల నుంచి మరణం వరకూ ‘మొఘల్‌’ కథ ఉంటుంది. అక్షయ్‌తో ‘జాలీ ఎల్‌ఎల్‌బి 2’ తెరకెక్కించిన సుభాష్‌ కపూర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్‌  స్టార్ట్‌ చేసి, ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

► క్వీన్‌ కంగనా
‘తను వెడ్స్‌ మను’, ‘క్వీన్‌’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ క్వీన్‌ అనిపించుకున్నారు కంగనా. ఇప్పుడు క్వీన్‌గా ఆమె నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్ని చిన్ని గాయాలవుతున్నా కంగనా లెక్క చేయకుండా చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

► దత్‌గా కపూర్‌
హీరో సంజయ్‌ దత్‌ జీవితం కథతో రాజ్‌కుమార్‌ హిరానీ ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సంజయ్‌గా రణబీర్‌ కపూర్‌ చేస్తున్నారు. యంగ్‌ ఏజ్, ఓల్డ్‌ సంజయ్‌గా కనిపించడం కోసం రణ బీర్‌ బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. సంజయ్‌ వృత్తి జీవితం, వ్యక్తిగత వివాదాలు వంటివి చూపిస్తారని టాక్‌. ఈ చిత్రానికి ‘సంజూ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. సంజయ్‌ దత్‌ని ‘సంజూ బాబా’ అని పిలుస్తుంటుంది బాలీవుడ్‌. అందుకే ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. జూన్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

► హృతిక్‌.. ఫస్ట్‌ బయోపిక్‌
ఇండియన్‌ ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి కష్టపడే పేద విద్యార్థుల కోసం ఆనంద్‌కుమార్‌ ‘సూపర్‌ 30’ అనే కాన్సెప్ట్‌ తయారు చేశారు. ఎందరో స్టూడెంట్స్‌కి శిక్షణ ఇచ్చి, వారు గెలిచేలా చేశారు. ఎవరీ ఆనంద్‌కుమార్‌ అంటే.. బిహారీ గణిత శాస్త్రవేత్త. ఆయన బయోపిక్‌లో నటించనున్నారు హృతిక్‌. ఆయన నటిస్తోన్న తొలి బయోపిక్‌ ఇది. విశాల్‌ బాల్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్‌ ‘సూపర్‌ 30’. నవంబర్‌లో రిలీజ్‌ కానుంది.

► అతని గోల్‌ గెలుపే
ఒక మ్యాచ్‌లో పెద్ద గాయం అయితే కోలుకుని మళ్లీ ఫిట్‌నెస్‌ను ప్రూవ్‌ చేసుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి గాయమే అయ్యింది హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌కి. కానీ మ్యాచ్‌లో కాదు లైఫ్‌లో. అంటే.. యాక్సిడెంట్‌ అయ్యింది. సందీప్‌ సింగ్‌ తిరిగి హాకీ స్టిక్‌ పట్టడం అసాధ్యం అన్నారు కొందరు. కానీ, అతని గోల్‌ గెలుపువైపు. హాకీ స్టిక్‌ పట్టుకున్నారు.. గోల్‌ కొట్టారు. అసాధ్యం కాదు.. సుసాధ్యం అని ప్రూవ్‌ చేశారాయన. ఇప్పుడు ఈ రియల్‌ కథనంపై రీల్‌ లైఫ్‌ స్టోరీ రూపొందుతోంది. షాద్‌ అలీ దర్శకత్వంలో ‘సూర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌ పాత్రలో నటిస్తున్నారు దిల్జీత్‌. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుంది.

► గురి ఎలా కుదిరింది
ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మెడల్‌ సాధించినవాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అభినవ్‌ బింద్రా ఈ కోవకే వస్తారు. 2008 బిజీంగ్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్స్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో గోల్డ్‌ పతకం సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అభినవ్‌. గోల్డ్‌ మెడల్‌పై అంత కచ్చితమైన గురి అతనికి ఎలా కుదిరిందన్న దానిపై ఇప్పుడు ఓ బయోపిక్‌ను హిందీలో రూపొందించనున్నారు. అభినవ్‌ బింద్రా పాత్రను హర్షవర్థన్‌ కపూర్‌ పోషించనున్నారు.  

► సెట్స్‌కు సై!
దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్‌ ఒకరు. ఆమె  జీవితం సిల్వర్‌ స్క్రీన్‌కు రానుంది. సైనా పాత్రను శ్రద్ధాకపూర్‌ పోషించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న వార్తలు వచ్చాయి. ‘‘అది నిజం కాదు. త్వరలో స్టార్ట్‌ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

► ఆడ.. ఈడ..అదే జోరు!
పది బయోపిక్స్‌ మాత్రమే కాదు.. మరికొన్ని సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. వాటిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇందులో విద్యాబాలన్‌ నటిస్తారని టాక్‌. రచయిత షాహిర్‌ బయోపిక్‌లో అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తారట. ఆల్రెడీ కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. మరి ఇంకెన్ని రియల్‌ స్టోరీస్‌ రీల్‌ పైకి వస్తాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే చెప్పిన తేదీ ప్రకారం పైన ఉన్న పది బయోపిక్‌లు రిలీజ్‌ అవుతాయా? ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు వాయిదా పడినట్లు పడతాయా? వేచి చూద్దాం. మరో సంగతేంటంటే.. ఆడ (హిందీ)లో మాత్రమే కాకుండా ఈడ (సౌత్‌) కూడా బయోపిక్స్‌ జోరు బాగానే ఉంది. ట్రెండ్‌తో, సీజన్‌తో సంబంధం లేదు. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల కథలతో ఎప్పుడు సినిమా తీసినా ‘వర్కవుట్‌’ అవుతుంది. ఏమంటారు? ఇంకో విషయం కూడా... బయోపిక్స్‌లో క్రీడాకారుల లైఫ్‌ హిస్టరీలు ఎక్కువగా ‘పిక్‌’ చేస్తుండటం విశేషం.

► నో ఫైట్‌!
సందీప్‌సింగ్‌కి, సంజయ్‌దత్‌కి నో ఫైట్‌. అయినా.. ఇదేంటి. హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌కి, నటుడు సంజయ్‌దత్‌కి ఫైట్‌ ఏంటి గురూ అంటే.. రియల్‌ లైఫ్‌లో కాదండి. రీల్‌ లైఫ్‌లో. అది కూడా వీరికి కాదు. వీరి బయోపిక్స్‌లో నటిస్తున్న హీరోలకి. ముందు సూర్మ (సందీప్‌ సింగ్‌ బయోపిక్‌)ను జూన్‌ 29న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ, మార్చి 30న రిలీజ్‌ కావాల్సిన ‘సంజు’ ( సంజయ్‌దత్‌ బయోపిక్‌కు పరిశీలనో ఉన్న టైటిల్‌) వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా జూన్‌ 29నే విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో రెండు బయోపిక్‌లకు క్లాష్‌ తప్పదని పరిశీలకులు అన్నారు. క్లాష్‌ ఉండకూడదనుకున్నారేమో ‘సూర్మా’ను ఆరు రోజులకు వాయిదా వేశారు. అంటే... జూలై 6న రిలీజ్‌ చేయనున్నట్లు  చిత్రబృందం పేర్కొంది.
సో.. నో ఫైట్‌ అన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top