బిగ్‌బాస్‌ షోకు ఆరోజే శుభం కార్డు!

Bigg Boss 3 Telugu: Bigg Boss Show Ends On 3rd November 2019 - Sakshi

బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు త్వరలో శుభం కార్డు పడనుంది. అత్యధిక టీఆర్పీలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయింది. వైల్డ్‌కార్డులు, రీ ఎంట్రీలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రేక్షకుల మనసు గెలవలేకపోయింది. పాత సీజన్‌లతో పోలుస్తూ బిగ్‌బాస్‌ తెలుగు 3 అట్టర్‌ ఫ్లాఫ్‌ అని ప్రేక్షకులు తేల్చి చెప్తున్నారు. బిగ్‌బాస్‌ మొదటి నుంచి ఇస్తూ వచ్చిన టాస్క్‌లు.. అష్టా చెమ్మా ఆటల కన్నా అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు. అయితే బిగ్‌బాస్‌ షో క్లైమాక్స్‌ చేరుకోవడంతో, ఇప్పటికైనా ఆసక్తికర టాస్క్‌లు ఇస్తారేమోనని ఎదురు చూశారు. కానీ అదీ నెరవేరలేదు. షో మొత్తంలో మరీ అంత గొప్పగా చెప్పుకోదగ్గ టాస్క్‌లు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రోమో చూస్తే భయానకంగా, ఒళ్లు గగుర్పొడిచేదిలా ఉంటుందని, తీరా ఎపిసోడ్‌ చూస్తే ఉసూరుమనిపిస్తుందని ప్రోమో లవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్స్‌ మాత్రమే, నో ఎంటర్‌టైన్‌మెంట్‌!
అంతదాకా ఎందుకు..? నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌.. సర్కస్‌ ఫీట్లకు ఏమాత్రం తీసిపోదు. పైగా ఇందులోనూ కొంతమందికి కాస్త కఠినంగా మరికొంతమందికి సులువైన టాస్క్‌లు ఇచ్చారని నెటిజన్లు బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ పూర్తిగా పక్కన పడేసి, కేవలం ప్రమోషన్స్‌కు మాత్రం బిగ్‌బాస్‌ను భీభత్సంగా వాడుకున్నారన్న వాదన లేకపోలేదు. మొదటి నుంచి ఈ కార్యక్రమంపై వెల్లువెత్తిన ఆరోపణలకు లెక్కేలేదు. ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్‌ గొడవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొద్దో గొప్పో రాహుల్‌.. పునర్నవిల లవ్‌ట్రాక్‌ కాస్త పర్వాలేదనిపించింది. మన్మథుడి హోస్టింగ్‌తో నెట్టుకొద్దామని చూసినప్పటికీ, బిగ్‌బాస్‌ షోలో అసలైన మజా లోపించి  టీవీల దగ్గర చతికిలపడిపోయింది. సోషల్‌ మీడియాలోనూ బిగ్‌బాస్‌పై చర్చ అంతంతమాత్రంగానే జరిగింది. ఇక ఎక్కువగా టాస్క్‌లు రద్దు చేసిన ఘనత కూడా ఈ సీజన్‌కే సొంతం. (చదవండి: జీరో నుంచి హీరోగా మారిన రాహుల్‌)

ఆరోజే ముగింపు..
జూ. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్‌ 70 రోజులు మాత్రమే కొనసాగింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌ 112 రోజులుపాటు కొనసాగి అత్యధిక రోజలు పాటు ప్రసారమైన బిగ్‌బాస్‌ సీజన్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మూడో సీజన్‌ 105 రోజుల పాటు జరగనుంది. దీపావళి తర్వాత నుంచి షో ప్రసార సమయంలో మార్పులు చేపట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. ‌స్టార్‌ మా ఛానల్‌లో కొత్త సీరియల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ షోను మరింత లేట్‌గా ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. దివాళీ తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు బిగ్‌బాస్‌ ప్రసారం కానున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో మాత్రం యథాతథంగా 9 గంటలకే ప్రసారమవనుంది. ఏదేమైనా క్లైమాక్స్‌లోనైనా బిగ్‌బాస్‌ షోను రక్తికట్టిస్తారో లేదో చూడాలి!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top