ఆలుమగల అన్యోన్యతకు బధాయీ హో!

badhaai ho movie 2018 - Sakshi

విలువలు, ఆదర్శాలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ బాధ్యత ఎప్పుడూ మధ్యతరగతిదే. ఆ భారాన్ని మోస్తూ సహజంగా జరిగే చాలా విషయాలను మహాపరాధంగా భావించి తలదించుకుంటోంది. పరువుతో ముడిపెట్టి పోరపాటు జాబితాను పెంచుకుంటుంది. ఈ మనస్తత్వానికి చిన్న చెక్‌.. ‘బధాయీ హో!’ ఏది జరిగినా యాక్సెప్ట్‌ చేసే తత్వాన్ని అలవర్చుకోవడం.. సిగ్గుతో చితికిపోకుండా ధైర్యంగా నిలబడే తీరుని చూపిన తీరుకి నిజంగానే ‘బధాయీ హో!’ సీరియస్‌ ఇష్యూని కామెడీ ట్రాక్‌ మీద పరిగెత్తించిన మూవీ ఇది. యాభై ఏళ్లు దాటిన వయసులో తల్లి గర్భవతి అవుతుంది. రిటైర్‌మెంట్‌కి దగ్గరగా ఉన్న తండ్రి పుట్టబోయే బిడ్డ ఆలనాపాలనకు సిద్ధపడ్తాడు. కన్‌ఫ్యూజన్‌ లేకుండా స్ట్రయిట్‌గా కథ తెలుసుకుందాం.

అమ్మానాన్నా.. ఒక చెల్లి..
జితేందర్‌( గజ్‌రాజ్‌ రావు).. రైల్వేలో టీసీగా పనిచేస్తుంటాడు. ప్రియంవద(నీనా గుప్తా) అతని భార్య. నకుల్‌ కౌశిక్‌(ఆయుష్మాన్‌ ఖురానా) వాళ్ల పెద్ద కొడుకు. గుల్లేర్‌..చిన్న కొడుకు.  నకుల్‌ది ఉద్యోగం చేసే వయసు. చేస్తుంటాడు కూడా యాడ్‌ ఏజెన్సీలో. అతనికి ఒక గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా ఉంటుంది రేనీ (సన్యా మల్హోత్రా). ఆ అమ్మాయి అతని కొలీగ్‌. ఆ పిల్ల సింగిల్‌ పేరెంట్‌ చైల్డ్‌. నకుల్‌ వాళ్లది మధ్యతరగతి కుటుంబం. రేనీది కాస్త ఉన్నత కుటుంబమే. ఎన్నో  విషయాలు నకుల్‌కి సంప్రదాయవిరుద్ధంగా అనిపించినవి, కనిపించినవి రేనీకి చాలా కామన్‌గా.. క్యాజువల్‌గా.. సింపుల్‌గా అనిపిస్తాయి. నేచురల్‌గా కూడా. అలాంటి వాటిల్లో నకుల్‌ తల్లి ప్రియంవద ప్రెగ్నెంట్‌ అవడం కూడా!
∙∙
తన తల్లి గర్భందాల్చింది అని తెలియగానే సిగ్గుతో చితికిపోతుంటారు నకుల్, ట్వల్త్‌ క్లాస్‌లో ఉన్న అతని తమ్ముడు గుల్లేర్‌. ఈ ఇద్దరితోపాటు వాళ్ల నానమ్మ (సురేఖా సిక్రీ) కూడా తెలియని అసహనంతో చిర్రుబుర్రులాడుతుంటుంది. ఒకానొక దశలో.. ‘‘తల్లితో మట్లాడ్డానికి బిజీ కాని.. పెళ్లాంతో గడపడానికి రికామీ’’ అని, ‘‘సర్కార్‌ నౌఖరి చేస్తున్నావ్‌.. సర్కార్‌ చెప్తున్న మాటలు వినపడట్లేదా? కండోమ్‌ వాడాలనే ఇంగితం కూడా లేదా?’’ అంటూ 55 ఏళ్ల కొడుకు మీద నోరు పారేసుకుంటుంది. చిన్నచిన్న అలకలు, సరదాసంతోషాలతో సందడిగా ఉన్న కుటుంబంలో  ప్రియంవద కడుపున ఓ నలుసు పడింది అని తెలియగానే స్మశాన నిశ్శబ్దం ఆవరిస్తుంది.

పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు.. సమయం దొరికితే చాలు తల్లిదండ్రుల మీద విసుర్లు విసురుతూ ఉంటుంది తల్లి. మొత్తానికి ఆ ఫ్యామిలీలోకి వచ్చే కొత్త మెంబర్‌ పట్ల ఆ భార్యభర్తలిద్దరు మాత్రమే ఆనందంగా ఉంటారు. దాన్నీ చాలా రహస్యంగా ఆస్వాదిస్తుంటారు. అమ్మానాన్నలు మూడోసారి అమ్మానాన్నలుగా అవడంపై వ్యంగ్యంగా కామెంట్లు చేసుకుంటూనే ఇంకో వైపు బయటకు చెప్పుకోలేని ఇబ్బందిగా ఫీలవుతుంటారు నకుల్, గుల్లేర్‌. ఈ విషయం వీధిలో వాళ్లకు, తమ ఫ్రెండ్స్‌కి తెలిసి.. ఆట పట్టిస్తుంటే అవమానంగా భావిస్తుంటారు. ఆఫీస్‌లో మూడీగా ఉంటుంటాడు నకుల్‌. గమనించిన రీనీ ఏమైందని అడుగుతుంది. చెప్పలేక చెప్పలేక చెప్తాడు.

ముందు అర్థంకాక కాస్త అయోమయపడినా.. తర్వాత సంతోషపడ్తుంది. కంగ్రాట్స్‌ చెప్తుంది. కంగ్రాట్స్‌ చెప్పుకునే విషయమా ఇది అంటూ కోపగించుకుంటాడు నకుల్‌. ‘‘అంటే ఫలానా వయసు వచ్చాక సెక్స్‌ ఉండకూడదనా నీ ఉద్దేశం? సరే జాగ్రత్తలు తీసుకోవడం, తీసుకోకపోవడం అటుంచి.. అట్‌లీస్ట్‌ ఈ వయసులో అంత అన్యోన్యంగా ఉన్నారు కదా.. నాకూ అలాంటి జీవితమే కావాలి. పిల్లలు పుట్టగానే భార్యభర్తల మధ్య రొమాన్స్‌ ఆగిపోవాలనే పురుషాధిపత్య ఆలోచనలున్న భర్త నాకొద్దు’’ అని మొహం మీదే తేల్చి చెప్తుంది రేనీ. ఒకసారి.. రేనీ వాళ్లింట్లో ఫంక్షన్‌కు నకుల్‌ని పిలిచి వాళ్లమ్మతో తమ ప్రేమ విషయం చెప్పమంటుంది. వెళ్తాడు. రేనీ వాళ్లమ్మకు నకుల్‌లోని సింప్లిసిటీ నచ్చుతుంది.

కానీ రేనీ ద్వారా నకుల్‌వాళ్లమ్మ ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలుసుకొని కాస్త చిరాకు పడుతుంది. నకుల్‌కి తమ్ముడో, చెల్లెలో పుట్టబోవడాన్ని నకుల్‌ పేరెంట్స్‌ బాధ్యతారాహిత్యంగా.. నకుల్‌ మీద పడే అదనపు బాధ్యతగా చెప్తుంది. ఇలాంటి నేపథ్యంలో నకుల్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల రేనీ ఎంత నష్టపోతుందో వివరిస్తుంది. తల్లి ధోరణి రేనీకి నచ్చదు. వీళ్లిలా మాట్లాడుకుంటున్నప్పుడే నకుల్‌ వస్తాడు మరిచిపోయిన సెల్‌ఫోన్‌ కోసం. వాళ్ల సంభాషణ వింటాడు. రేనీ వాళ్లమ్మను ఎదురిస్తాడు. దీంతో రేనీకి, నకుల్‌కి చెడుతుంది. రేనీ వాళ్లమ్మ మాటలు విన్నప్పటి నుంచి తన తల్లిని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తాడు నకుల్‌. ఈ లోపే జితేందర్‌ తన భార్య, తల్లిని తీసుకొని చెల్లి కూతురి పెళ్లికి ఊరెళ్తాడు. అక్కడ ప్రియంవదను చూసి అందరూ తలోమాట మాట్లాడుతుంటారు.

పెళ్లయ్యాక పెట్టుపోతలప్పుడు ప్రియంవద ఆడపడుచు, తోడికోడలూ ప్రియంవద మొహం మీదే ఈ వయసులో ఈ పనేంటి అంటూ ఆమెను అవమానపరుస్తుంటారు. అప్పుడు సురేఖా సిక్రీ తన చిన్న కోడలు ప్రియంవద వైపు నిలిచి కూతురిని, పెద్ద కోడలిని దులిపేస్తుంది. తిరిగి వాళ్లు ఢిల్లీ వచ్చేటప్పటికి నకుల్, గిల్లేర్‌ కూడా  మారిపోతారు. తల్లికి కావాల్సిన సపర్యలు చేస్తుంటారు. ఎట్‌ ది ఎండ్‌.. ప్రియంవద పండంటి ఆడపిల్లను ప్రసవిస్తుంది. రేనీ వాళ్ల అమ్మ కూడా నకుల్‌ను యాక్సెప్ట్‌ చేస్తుంది. రేనీ, నకుల్‌ ఒకటవుతారు. బుజ్జి పాప ఆ ఇంట ఆనందాలను పూయిస్తుంది. ఆద్యంతం పంజాబీ స్లాంగ్‌లోని వ్యంగ్యం.. హాస్యంతోనే సాగుతుంది ఈ చిత్రం. ఏ ఇంటిమసీ లేక మధ్యతగరతిలోని చాలా కాపురాలు కలహాల చితిగా మారుతాయో.. ఆ ఇంటిమసీ ఎంత ముఖ్యమో చెప్పింది. కష్టసుఖాలను పంచుకోవడంతోపాటు రొమాన్స్‌ పండించుకోవడము ఉంటేనే అసలైన అన్యోన్యత అని చూపించింది ‘బధాయీ హో!’. ఈ చిత్రానికి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top