21 ఏళ్ల క్రితం ఇక్కడే నన్ను చెరబట్టాడు

Asia Argento Speech at Cannes about Harvey Weinstein - Sakshi

భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఇటాలియన్‌ నటి ఏసియా అర్గెంటో

పారిస్‌: హాలీవుడ్‌ మూవీ మొఘల్‌ హార్వీ వెయిన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్‌ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కామాంధుడి వ్యవహారం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణమైన వ్యక్తుల్లో ఒకరు ఇటాలియన్‌ నటి ఏసియా అర్గెంటో. 1997లో కేన్స్‌ చలనచిత్రోత్సవానికి హాజరైన తనపై వెయిన్‌స్టీన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె అప్పట్లో ఆరోపించారు. తద్వారానే మరికొందరు సెలబ్రిటీలు ముందుకు రావటంతో ఆయన లీలలు బయటపడ్డాయి. అయితే తనపై జరిగిన దారుణంపై అర్గెంటో ప్రస్తుతం జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా స్పందించారు. 

భయానక అనుభవం... ‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఇదే కేన్స్‌ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్‌స్టీన్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళలను జీవితాలను నాశనం అతనికి కేన్స్‌ ఓ వేదికగా ఉండేది. అప్పట్లో నేను నటించిన ఓ చిత్రానికి వెయిన్‌స్టీన్‌ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. అందుకే చిత్ర యూనిట్‌ మొత్తానికి ఓ పెద్ద హోటల్‌లో పార్టీ ఇస్తానంటూ ఆహ్వానించాడు. తీరా నేను అక్కడికి వెళ్లే సరికి పార్టీ వాతావరణం లేదు. హోటల్‌ గదిలో వెయిన్‌స్టీన్‌ ఒక్కడే ఉన్నాడు. తిరిగి నేను బయలుదేరుతున్న సమయంలో మసాజ్‌ చేయాలంటూ నన్ను బతిమిలాడాడు. నన్ను దగ్గరికి లాక్కుని మృగంలా ప్రవర్తించాడు. భయంతో వణికిపోయా. నన్ను చిత్రవధలకు గురిచేస్తూ అత్యాచారం చేశాడు’ అంటూ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. 

‘నాలాగే చాలా మంది బాధితులు ఉంటారని అప్పుడే భావించా. అందుకే ఆయన విషయాలను వెలుగులోకి తెచ్చా. కానీ, ఇప్పుడు ఒక్కటే చెప్పదల్చుకుంటున్నా. ఆ రాక్షసుడు ఇకపై ఇక్కడ కనిపించడు. అది నాకు సంతోషాన్ని ఇస్తోంది. అవకాశాల కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి’ అని ఆమె ప్రసంగించారు.

అర్గెంటో భావోద్వేగ ప్రసంగంపై పలువురు సెలబ్రిటీలు అభినందనలు వ్యక్తం చేశారు. చాలా ధైర్యంగా మాట్లాడారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే అదే సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. అంతర్జాతీయ వేదికపై ఆ విషయాన్ని అంత వివరంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని? కొందరు ప్రశించగా, త్వరలో తాజాగా ఆమె ఓ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారని.. దాని ప్రమోషన్‌ కోసం ఆమె ఇలా ప్రసంగం ఉంటారని మరికొందరు విమర్శిస్తున్నారు. నిర్మాత కమ్‌ దర్శకుడు అయిన వెయిన్‌స్టీన్‌ గురించి సుమారు 50 మంది నటీమణులు ఆరోపణలు గుప్పించగా, ఆ దెబ్బకు సొంత నిర్మాణ సంస్థ ‘ది వెయిన్‌స్టెయిన్‌’తోపాటు కీలక పదవులకు ఆయన దూరం కావాల్సి వచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top