రజనీకాంత్‌కి బాషా, కమల్‌హాసన్‌కి నాయకుడు...

రజనీకాంత్‌కి బాషా, కమల్‌హాసన్‌కి నాయకుడు...


 సూర్యకు సికిందర్ ‘‘పవర్‌స్టార్, సూపర్‌స్టార్ కలిస్తే ఎంత పవరుంటుందో సూర్యలో అంత పవర్ ఉంటుంది’’ అంటున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. సూర్య కథానాయకునిగా లింగుస్వామి దర్శకత్వంలో ‘సికిందర్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘తమిళంలో ఎంత స్టార్‌డమ్ ఉందో, తెలుగులో కూడా అంతే స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సూర్య. ‘సికిందర్’ ఆయన్న మరో మెట్టుపై నిలబెట్టే సినిమా అవుతుంది. ఇందులో ఆయన స్టయిలిష్ డాన్‌గా నటించారు.

 

 రజనీకాంత్‌కి ‘బాషా’, కమల్‌హాసన్‌కి ‘నాయకుడు’లా సూర్యకు ‘సికిందర్’ నిలిచిపోతుంది. సూర్య ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఇందులో ఆయన రెండు రకాలుగా కనిపిస్తారంతే’’ అని చెప్పారు లగడపాటి శ్రీధర్. రీమేక్‌లు ఎక్కువగా చేస్తున్నారేంటని తనను చాలామంది అడుగుతున్నారనీ, తన దగ్గర చాలా కథలు ఉన్నా... ఆ కథలకు తగ్గ స్టార్ హీరోలు దొరకడం లేదనీ, అందుకే రీమేక్‌లు చేస్తున్నాననీ శ్రీధర్ చెప్పారు. రీమేక్‌లు, డబ్బింగులు పక్కనపెట్టి త్వరలోనే ఓ భారీ తెలుగు సినిమా చేస్తానని ఆయన తెలిపారు.

 

  తాను నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా గురించి చెబుతూ -‘‘ప్రేమలోని అసలైన కోణాన్ని ఆవిష్కృతం చేసే కథాంశమిది. కన్నడ ‘చార్మినార్’ చిత్రం దీనికి మాతృక. మన నేటివిటీకి తగ్గట్టుగా క్లైమాక్స్ మార్చాం. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. తమ రామలక్ష్మీ క్రియేషన్స్ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని లగడపాటి శ్రీధర్ తెలిపారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top