
నటుడు ప్రదీప్ శక్తి కన్నుమూత
'నాయకుడు(1987)' సినిమాలో కరడుగట్టిన పోలీస్ అధికారి పాత్రతో పాపులర్ అయిన ప్రదీప్ తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయం.
హైదరాబాద్: అరడజనుకుపైగా భాషల ప్రేక్షకులను తన నటనా ప్రతిభతో మెప్పించిన ప్రదీప్ శక్తి ఇకలేరు. చాలా కాలం కిందటే నటనకు స్వస్తిచెప్పి అమెరికాలో స్థిరపడ్డ ఆయన శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) గుండెపోటుతో కన్నుమూశారు. 'నాయకుడు(1987)' సినిమాలో కరడుగట్టిన పోలీస్ అధికారి పాత్రతో పాపులర్ అయిన ప్రదీప్ తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయం. గుంటూరు జిల్లా లక్ష్మీపురం ఆయన స్వస్థలం. ప్రదీప్ పూర్తిపేరు వాసిరెడ్డి ప్రదీప్ శక్తి.
పలు చిత్రాల్లో విలన్ పాత్రలతో జీవించిన ప్రదీప్ శక్తితో దర్శకుడు వంశీ తనదైన స్టైల్లో కామెడీ చేయించి ప్రేక్షకులను మెప్పించారు. లేడీస్ టైలర్ తో ప్రారంభమైన వాళ్లిద్దరి కాంబినేషన్ 'ఏప్రిల్ 1 విడుదల', చెట్టుకింద ప్లీడర్, నిన్నమొన్నటి గోపీ గోపికా గోదావరి వరకు కొనసాగింది. ఇవేకాక టూటౌన్ రౌడీ, ప్రేమ, గుణ, ఆలాపన, బ్రహ్మ, ఏడు కొండలస్వామి, అన్న, అగ్గిరాముడు, చిత్రంభళారే విచిత్రం, మధురై మీనాక్షి, పరుగోపరుగు లాంటి సినిమాల్లోనూ నటించారాయన. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ప్రదీప్ శక్తి నటించిన చివరిసినిమా. 'కలియుగ విశ్వామిత్ర' అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.
సినీరంగంలో అవకాశాలు మెండుగానే ఉన్నప్పటికీ 1993లో నటన నుంచి తప్పుకున్న ప్రదీప్ శక్తి అమెరికా వెళ్లి హోటల్ వ్యాపారం ప్రారంభించారు. అందులోనూ విజయం సాధించారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటోన్న ఆయన శనివారం ఛాతినొప్పితో కుప్పకూలిపోగా, కుటుంబసభ్యులు స్టేట్ ఐలాండ్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కన్నుమూశారాయన. అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహిస్తామని ప్రదీప్ శక్తి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.