Telugu LOVE Stories: Chintu (Lover of Blessy) Shared His Love Story and Memories - Sakshi
Sakshi News home page

నా జీవితంలో ఎప్పటికి సమంతలా ఉంటానంది

Oct 10 2019 12:25 PM | Updated on Oct 30 2019 5:26 PM

Young Man Chintu love story - Sakshi

  నా చేయి పట్టుకొని ‘నీ జీవితంలో నేను ఎప్పటికీ సమంతా లాగే...

ఆ రోజు ఉదయం తన నుంచి మెసేజ్ వచ్చింది. కంపెనీ మేసేజేమోలేనని పెద్దగా పట్టించుకోలేదు, మర్చిపోయాను. తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఇంకోటి వచ్చింది. ఈ సారి పరిశీలించాను. అవును అది తన నుంచే... నా బ్లేస్సీ నుంచే...

తను ఐఐటీలో టాపర్. నేను సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో యావరేజ్ స్టూడెంట్. నాకున్న ఒకే ఒక్క ప్లస్.. తనకన్నా ముందే ఇంజనీరింగ్ పూర్తవడం మాత్రమే. తనను మొదటి సారి చూడగానే ' ఈ పిల్ల నాకోసమే పుట్టిందిరా ' అనిపించింది. కానీ ప్రపోజ్ చేస్తే వెంటనే ఒప్పుకునే రకం కాదు. పైగా చాట్ పక్క దోవ పట్టినపుడల్లా చిన్న వార్నింగులు కూడాను. నాదేమో అటూఇటుగా రాయలసీమ యాస. తనదేమో పక్కా గోదావరి యాస. అందులో చాలా పదాలకు పడి పడి నవ్వుకునే వాళ్ళం. నీలాకాశాన్ని థోర్ సుత్తితో కొట్టి మలచిన కలువల్లాంటి కళ్ళు, జోరువానలో సరళ రేఖల్లా జారే చినుకుల్లాంటి కురులు, చందమామను కవ్వంతో చిలకగా వచ్చిన పాల నురగల్లాంటి బుగ్గలు తననుంచి నన్ను చూపు తిప్పుకోనిచ్చేవి కాదు.

తనను అలా చూస్తూ ఉండిపోయేవాన్ని. తను మహా సిగ్గరి. సిగ్గు పడిందంటే తల కూడా పైకెత్తేది కాదు. కానీ తను సిగ్గుపడినప్పుడు, తల వంచుకుని ఇచ్చే చిరునవ్వు నన్ను ప్రతిసారీ మంత్రముగ్ధున్ని చేసేది.   ఆ నవ్వు కోసమే గంటల తరబడి తనను చూసేవాణ్ణి. చదువుల నుంచి కెరీర్ వరకూ.. కుటుంబం నుంచి ఇష్టాల వరకు అన్నీ షేర్ చేసుకున్నాం. అందులో కొన్ని కలిశాయి. ఎక్కువ శాతం కలవలేదు. అయినా పుప్పొడి, కీలాగ్రం కలిస్తే పూవు పూస్తుంది తప్ప పుప్పొడి, పుప్పొడి కలిస్తే పూయదుగా..  అందుకే దూసుకుని ముందుకెళ్లా... నా అంచనా నిజమైంది. కాలం గడిచేకొద్దీ మా అభిరుచులు మారాయి. మాకు నచ్చిన ఉమ్మడి అంశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

2017 మే 29న ఎలాగైనా తనకు ప్రపోజ్ చేయాలని (తొలిసారి) ఫిక్సయ్యా. ఆ రోజుకు ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏమీ లేదు. కానీ లేటు చేసేకొద్ది తను దొరకదేమో అని భయం వేసింది. ఆ రోజు తనతో చాట్ చేసేటపుడు లవ్ వైపు అంశాన్ని మార్చాను. తనకు అర్థమైంది కాబోలు బై చెప్పింది. నేను పట్టు వదలని విక్రమార్కుడిలా వీర లెవల్లో మేసేజులు చేశా... గంటలు గడిచినా డెలివర్ కాలేదు. విషయమేంటంటే... తను నన్ను బ్లాక్ చేసింది.  తన అంత కఠిన మనస్సు ఉన్నది కాదు. నాకు తెలుసు అందుకే వెయిట్ చేశా...

మూడు రోజుల తర్వాత...

ఆ రోజు ఉదయం తన నుంచి మెసేజ్.......  ......అవును అది తన నుంచే... నా బ్లేస్సీ నుంచే...

ఈ సారి లేటు చేయలేదు. యూ ఆర్ మై ఎవ్రీథింగ్ అని మెసేజ్ పెట్టాను. ఏదో తెలియని దానిలా దాని అర్థం ఎంటి అని అడిగింది. ఐ లవ్ యూ అన్న వాక్యం తప్ప అన్నీ చెప్పాను. ఎందుకంటే ఆ వాక్యం ప్రతి ఒక్కరూ చెప్పేదే. కానీ తను నన్ను అప్పటికే లవ్ చేస్తోంది. నాకే తెలీకుండా... మా ప్రేమ రోజు రోజుకీ పెరిగి పెద్దదైంది. అప్పుడపుడూ మా మధ్య గొడవలు వచ్చేవి. అందులో ఎక్కువ శాతం నా నుంచే వచ్చేవి. కానీ తను ఓపిగ్గా భరించి దిశానిర్దేశం చేస్తుంది. గొడవ జరిగి అయిపోయాక మా మధ్య జరిగే ప్రేమ సంభాషణ మరింత లోతుగా ఉంటుంది. ప్రతి గొడవ మమ్మల్ని ఇంకా దగ్గర చేస్తుంది. తన పుట్టిన రోజుకు నేనో బహుమతి ఇచ్చాను. అది తనకు చాలా నచ్చింది. తన కోసం తన ఇంట్లో వారందరికీ పరిచయం అయ్యాను.

కానీ వాళ్ళకి కేవలం ఫ్రెండ్ గానే తెలుసు. ఒకసారి సినిమా చూడటానికి మేము ఒక సిటీకి వెళ్ళాలని అనుకున్నాం. కానీ సెలవు రోజులు కావడంతో బస్సులన్నీ ఫుల్. చివరకు రైలుకు వెళ్ళాలని డిసైడయ్యాము. అది కూడా నిండిపోయి ఉంది. గత్యంతరం లేక ఎక్కాము. రైల్లో తలుపు వద్ద నేను నా ఎడమ పక్క తను. జనాలు ఎక్కువవుతున్నారు. నేను రైలు ద్వారం అంచున ఉన్నాను. నేనెక్కడ పడిపోతానో అని తను నన్ను పట్టుకుంది. సమయం గడిచే కొద్దీ తను మరింత దగ్గరైంది. మరో అరగంటకు తను పూర్తిగా నా కౌగిలిలో బంధీ అయింది. తన చెవి సరిగ్గా నా గుండెపై ఆనించింది. పడిపోతానేమో అని నేను డాన్స్ చేయట్లేదుగానీ నా గుండె మాత్రం అప్పటికే శాస్త్రీయ నృత్యం సహా రకరకాల డాన్సులు వేస్తోంది. అవును.. తనే నా గుండె చప్పుడు మరి.

కిక్కిరిసిన రైలులో ప్రేయసితో ప్రయాణం అంత బాగుంటుందని అప్పుడే అర్థం అయింది. చివరకు మజిలీ మూవీ హాలు చేరుకున్నాం. సమంత ఎంటరయిన నిమిషం నుంచి తాను ఏడవడం ప్రారంభించింది. కానీ కొంచెం ఫన్నీగా అనిపించింది. కానీ సినిమా అయ్యాక  నా చేయి పట్టుకొని ‘నీ జీవితంలో నేను ఎప్పటికీ సమంతా లాగే ఉంటాను’ అని తను అన్న క్షణం ఆ కన్నీళ్ల విలువ నాకు తెలిసింది.  తన మనసును అంత దగ్గరగా చూసిన మొదటి క్షణాలు అవే. తనూ నేనూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. విషయం వాళ్ళ అమ్మకు కూడా కొద్దిగా తెలుసు. మా మధ్య ఇప్పుడొచ్చిన అడ్డం.... కులం. కలుపుకు పోవాలని అనుకుంటే వంద కారణాలు కూడా అడ్డం రావు. వద్దనుకుంటే జుట్టు రంగు కూడా అడ్డం పడొచ్చు. ఏమవుతుందో తెలీదు.... మంచే జరగాలని అనుకుంటున్నా...
- చింటు లవర్ ఆఫ్ బ్లెస్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement