అవినీతి ‘విక్రమార్కుడు’

Nandyala muncipal Employee Doing Corruption - Sakshi

మున్సిపల్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగి దందా

సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో ఓ అవినీతి విక్రమార్కుడి దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా చిన్న పనికి కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్‌ చేయడం ఆ ఉద్యోగి స్టైల్‌. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి  ఉన్నతాధికారులను సైతం తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. మాట వింటే వాటా ఇస్తాడు. వినకపోతే వార్నింగ్‌ ఇస్తాడు. కార్యాలయంలో వాహనాలను సైతం బినామీ పేర్లతో పెట్టుకున్నాడు. కొంత కాలంగా రెవన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి తక్కువ సమయంలోనే లక్షలు గడించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

స్థలం విలువ బట్టి మామాలు 
పట్టణంలో ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన యజమానులు స్థలానికి సంబంధించిన పన్ను వారి పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మార్చాలంటే ఆ ఉద్యోగి అడిగినంత ముట్టజెప్పాల్సిందే. స్థలం విలువను బట్టి మామూలు ఎంత ఇచ్చుకోవాలో నిర్ధారిస్తాడు. ఉద్యోగి అడిగినంత అప్పజెప్తే వెంటనే స్థలయజమానికి పన్ను రాసి ఇస్తాడు. ఈ నేపథ్యంలో నూతనంగా ఓ ఇళ్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఆ ఉద్యోగిని పన్ను మార్పు కోసం సంప్రదిస్తే.. తాను అడిగినంత ఇస్తే పన్ను తగ్గించి రాస్తానని చెప్పినట్లు సమాచారం. ఇలా ఇతని ఆగడాలతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. 

టీడీపీ నేతలకు పన్ను చెల్లింపుల్లో వెసులుబాటు... 
టీడీపీ నేతలకు చెందిన బిల్డింగ్‌లకు సంబంధించి పన్ను బకాయిలు  రూ.లక్షల్లో ఉన్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లగా కొందరు టీడీపీ నేతలు పన్నులు చెల్లించకుండా ఉన్నారు. వారి వద్దకు వెళ్లి బకాయిలు చెల్లించాలని వత్తిడి చేయకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది.  

అద్దె వాహనాలూ అతనివే... 
స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్నతాధికారుల అద్దె వాహనాలను సదరు ఉద్యోగి బినామి పేర్లతో ఉంచి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ నేతల అండదండలు ఉండటంతో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయకుండా దందా  కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి నెలకు దాదపు రూ.35 వేలు సంపాదించటమే కాక, ఉద్యోగ విధుల్లో  అవినీతికి పాల్పడుతూ రూ.లక్షలు గడిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం  అతడిపై ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం విమర్శలకు దారి తీస్తోంది.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top