రాతికోటకు బీటలు

Papanna fort reached to ruins - Sakshi

చెదిరిపోతున్న పాపన్న ఆనవాళ్లు  

శిథిలావస్థకు చేరిన కోట

సాక్షి, జనగామ: మొఘల్‌ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్‌ సర్వాయి పాపన్న రాతి కోటకు బీటలు పడుతున్నాయి. నాటి గోల్కొండ రాజ్యాన్ని జయించి విజయ కేతనం ఎగురేసిన కోటను ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక కూలిపోయే దశకు చేరుకుంది. టూరిజం స్పాట్‌గా గుర్తించి నిధులు కేటాయించినా కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. 

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న క్రీ.శ 17వ శతాబ్దంలో రాతి కోటను నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కాలంలో మొఘల్‌ పాలకులు నియమించిన సుబేదార్ల ఆగడాలతో రాజ్యంలో ఆరాచకం నెలకొంది. ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయంలో క్రీ.శ. 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా, తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. పాలకులు విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకమైతేనే రాజ్యా ధికారానికి రావచ్చని సొంతం సైన్యం ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టారు. మొగల్‌ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న తొలి కోటను ఖిలాషాపూర్‌లోనే నిర్మించి నట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మర ణించాక మొఘల్‌ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను పాపన్న స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్‌ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, గోల్కొండను వశపర్చుకున్నారు. 

రాతి కోట నిర్మాణం ఇలా..
ఖిలాషాపూర్‌లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతి కోటను నిర్మించారు. ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా కోటను నిర్మాణం చేశారు. అంతేకాకుండా కోట సొరంగ మార్గాలను సైతం తవ్వించినట్లుగా చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నారు. శత్రు దుర్భేధ్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు.

చెదిరిపోతున్న కోట ఆనవాళ్లు..
బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన పాపన్న నిర్మించిన రాతి కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. కోట లోపలి భాగం ధ్వంసం అవుతోంది. గోడలు కూలిపోతున్నాయి. 2017 జనవరిలో కోట మరమ్మతు కోసం టూరిజం శాఖ రూ. 3 కోట్లు కేటాయించింది. అయినా పనులు చేపట్టకపోవడంతో కోట అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు టూరిజం శాఖ చైర్మన్‌ పేర్వారం రాములు సొంత గ్రామంలోనే ఈ కోట ఉండటం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కోట అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top