త్వరలో ‘హెచ్‌–1బీ’ పిడుగు!

US to soon end work permits for spouses of H-1B holders - Sakshi

వీసా జారీ నిబంధనలను కఠినతరం చేయనున్న యూఎస్‌సీఐఎస్‌

హెచ్‌–4 వీసాదారుల ఉద్యోగ అనుమతుల రద్దుకు యోచన  

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులు చేరేందుకు అవకాశం కల్పించే హెచ్‌–1బీ వీసా జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా పౌర, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా సెనెటర్‌ చక్‌ గ్రాస్లీకి ఈ నెల 4న రాసిన ఓ లేఖలో వివరించారు. ప్రస్తుతం లక్షల మంది భారతీయులు హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు.

భారత ఐటీ కంపెనీలు అమెరికాలో తమ కార్యకలాపాల కోసం ఈ వీసాపైనే ఎక్కువగా ఉద్యోగులను పంపుతుంటా యి. హెచ్‌–1బీ వీసా మోసాలను అరికట్టడంతోపాటు అత్యంత నైపుణ్యవంతులే అమెరికాకు వచ్చేలా నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నామని సిస్నా లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధానంగా రెండు సవరణలను చేయనున్నామన్నారు. అందులో మొదటిది పరిమిత సంఖ్యకు లోబడి దరఖాస్తులను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో స్వీకరించడం కాగా రెండోది ‘ప్రత్యేక నైపుణ్యం’ నిర్వచనాన్ని మార్చడం.

మొదటి నిబంధన వల్ల హెచ్‌–1బీ దరఖాస్తులను స్వీకరించి, లాటరీ తీసే పద్ధతిని యూఎస్‌సీఐఎస్‌ మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇక రెండో నిబంధనతో అత్యంత నైపుణ్యవంతులనే అమెరికాలోకి అనుమతించే వీలు కలుగుంతుదనీ, అలాగే యజమాని–ఉద్యోగి సంబంధం, ఉపాధి నిర్వచనాలను మార్చడం ద్వారా అమెరికా ప్రజలకు మెరుగైన ఉద్యోగాలు, వేతనాలు లభిస్తాయన్నారు.

జీవిత భాగస్వాములకు ‘రద్దు’!
హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న నిబంధనలను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సిస్నా పేర్కొన్నారు. ఇదే జరిగితే 65 వేల మందికి పైగా భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్‌–4 వీసాలు మంజూరు చేస్తారు.

హెచ్‌–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునే అనుమతులను నాటి అధ్యక్షుడు ఒబామా 2015లో ఇచ్చారు. ఇప్పు డు వీటిని రద్దు చేయాలని అనుకుంటున్నామనీ, ఈ వేసవికాలం తర్వాత అధికారిక ప్రకటన రావొచ్చని సిస్నా వెల్లడించారు. కాగా, 71,287 మంది హెచ్‌–4 వీసా దారులకు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతుల్వివగా, వారిలో 93% మంది భారతీయులే ఉన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top