అగ్ర దేశాల దౌత్య యుద్ధం

US orders closure of Chinese consulate in Houston - Sakshi

హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ మూసివేతకు అమెరికా ఆదేశం

వాషింగ్టన్‌/బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ జనర ల్‌ను మూసివేయాలంటూ ట్రంప్‌ సర్కార్‌ ఆదేశిం చడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో అగ్గి రాజుకుంది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ జనరల్‌ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్‌  మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే చైనా ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు.

దెబ్బకి దెబ్బ తీస్తాం: చైనా
అమెరికా నిర్ణయం అత్యంత దారుణమైనదని, అన్యాయమైనదని చైనా విరుచుకుపడింది.. అమెరికా తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతీకార చర్యలు తప్పవని  చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌హెచ్చరించారు.

కాన్సులేట్‌ జనరల్‌లో మంటలు
అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌లో మంటలు చెలరేగాయి. కార్యాలయం ఆవరణలో చైనా ప్రతినిధులు డాక్యుమెంట్లు తగులబెట్టడంతో మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ని మూసివేయాలని ఆదేశాలు జారీ అయిన కాసేపటికే కాన్సులేట్‌లో మంటలు రేగాయి. కొన్ని కంటైనర్లు, డస్ట్‌ బిన్స్‌లో డాక్యుమెంట్లు వేసి తగులబెట్టడంతో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్‌ అయ్యాయి. మంటలు ఆర్పడానికి వెళ్లే అగ్నిమాపక సిబ్బందికి కాన్సులేట్‌ అధికారులు అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు.

ఎందుకీ మూసివేత!
అమెరికా, చైనా మధ్య కోవిడ్‌ వ్యాక్సిన్‌ అధ్యయనాల హ్యాకింగ్‌ చిచ్చు కాన్సులేట్‌ మూసివేతకు ఆదేశాల వరకు  వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ  ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top