‘నన్ను, నా కూతుర్ని కోల్డ్‌ ఫ్రీజర్‌లో పడేశారు’

US Lawmaker Gets Emotional As Migrant Mother Describes Baby Death - Sakshi

వాషింగ్టన్‌ : వలసదారులను నిలువరించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్‌ విధానం ఎంతోమంది శరణార్థు జీవితాల్లో విషాదం నింపుతోంది. స్వదేశంలో పరిస్థితులు బాగోలేక అమెరికా వెళ్లి పొట్ట పోసుకోవాలని భావిస్తున్న వారి బతుకులను చీకటి చేస్తోంది. అమెరికా సరిహద్దుల్లో శరణార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టే ఫొటోలు ఎన్నెన్నో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమెరికా వెళ్లే క్రమంలో ఇటీవల మరణించిన రోమిరేజ్‌- అతడి కూతురు వాలేరియా(ఎల్‌ సాల్వేడార్‌)  శవాల ఫొటో ప్రపంచం మొత్తాన్ని కన్నీరు పెట్టించింది. తాజాగా జీరో టాలరెన్స్‌ కారణంగా 19 నెలల చిన్నారిని కోల్పోయిన యజ్మిన్‌ జురేజ్‌ అనే మహిళ గాథ అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల మనస్సులను సైతం కదిలించింది. తన నుంచి కూతురిని విడదీసి ఆమెను తనకు శాశ్వతంగా దూరం చేశారంటూ యజ్మిన్‌ ఆవేదన చెందిన తీరు వారి చేత కంటతడి పెట్టించింది.

చదవండి : ‘వారి కళ్లల్లో భయం..మానవత్వానికే మచ్చ’

జీరో టాలరెన్స్‌ ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి.. వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అదే విధంగా కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌(సీబీపీ) ఫోర్స్‌ చిన్నారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీరో టాలరెన్స్‌ విధానంపై పునరాలోచిస్తామని ట్రంప్‌ సర్కారు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శరణార్థులు బుధవారం యాజ్మిన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తల ఎదుట హాజరయ్యారు.

చదవండి : ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్న ఫొటో

తనో చోట.. నేనో చోట
ఈ సందర్భంగా యజ్మిన్‌ మాట్లాడుతూ...‘ గ్వాటెమాలాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉండలేకపోయాను. అందుకే నా 19 నెలల కూతురితో కలిసి అమెరికా వచ్చి జీవనోపాధి పొందాలనుకున్నాను. ఈ క్రమంలో గతేడాది చివర్లో ఇక్కడికి వచ్చే క్రమంలో సరిహద్దులో భద్రతా బలగాలు నన్ను అరెస్టు చేశాయి. నా మారీ(కూతురు)ని నా నుంచి దూరం చేశాయి. అప్పటి నుంచి తనో చోట. నేనొక చోట. ఒకరోజు అకస్మాత్తుగా తన ఆరోగ్యం పాడైందని చెప్పి నన్ను తన దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత తను ఉన్న కోల్డ్‌ ఫ్రీజర్‌లో తనతో పాటు నన్నూ బంధించారు. పాపను కాపాడమని అక్కడి డాక్టర్లను ఎంతగా వేడుకున్నానో. కానీ వాళ్లెవరూ కనికరించలేదు. వెంటనే అధికారుల దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి విడిపించాలని ప్రాధేయపడ్డాను. ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లేందుకు నాకు అనుమతినిచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నా మారీని ఇక అక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా పోయింది. తను మెల్లమెల్లగా ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశాను. వాళ్లు నా గుండెను చీల్చారు. కడుపుకోత మిగిల్చారు’ అని కన్నీళ్లతో తన గోడు వెళ్లబోసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో చిన్న పిల్లలు ప్రవర్తించే తీరు ప్రపంచం మొత్తానికి తెలియాలని.. అందుకే తన ఆవేదన పంచుకుంటున్నానని ఉద్వేగానికి లోనైంది.  ఇప్పటికైనా ట్రంప్‌ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

చదవండి : తాలిబన్లే నయం; సబ్బు, పరుపు ఇచ్చారు!

అందుకే కఠినంగా ఉంటున్నాం
ఈ క్రమంలో యజ్మిన్‌ మాటలు వింటున్న కాంగ్రెస్‌ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో(29- అత్యంత పిన్న వయస్కురాలైన లా మేకర్‌) కార్టెజ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. యాజ్మిన్‌ను గుండెలకు హత్తుకుని కంటతడి పెట్టారు. ఆమె గాథ ఫెసిలిటీ సెంటర్లలో ఉంటున్న పిల్లల బాగోగులను సమీక్షించాల్సిన ఆవశ్యకతను వివరించిందన్నారు. మరోవైపు సరిహద్దులో వలసదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతుండటంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని అమెరికా హోం లాండ్‌ విభాగం ప్రకటన విడుదల చేసింది. వారిని నిలువరించే క్రమంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా.. మధ్య అమెరికా దేశాల్లో పెచ్చు మీరిన హింస, పేదరికం కారణంగా ఎంతో మంది పొట్ట చేత బట్టుకుని అమెరికా సరిహద్దుల్లో నేటికీ పడిగాపులు గాస్తూనే ఉండటం విచారించదగ్గ విషయం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top