‘చిన్నారి’ ఫొటోకు ప్రతిష్టాత్మక అవార్డు

Migrant Child Crying At US Border Image Wins Photo Journalism Award - Sakshi

ఆమ్‌స్టర్‌డామ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్‌’  విధానం కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు తార్కాణంగా నిలిచిన ఓ ‘చిన్నారి’  ఫొటోకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికా సరిహద్దుల్లో వలసదారుల పట్ల ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కళ్లకు కట్టిన ఈ ఫొటోను తీసినందుకుగాను గెట్టీ ఫొటోగ్రాఫర్‌ జాన్‌ మూరే ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో అవార్డు’ సొంతం చేసుకున్నారు. తమ దేశంలోకి ప్రేవేశించకుండా వలసదారులను అడ్డుకునే క్రమంలో అమెరికా సరిహద్దు బలగాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వలసదారుల నుంచి తమ పిల్లలను వేరు చేస్తూ కేజ్‌లలో బంధిస్తున్నారనే కారణంగా  ట్రంప్‌ సర్కారు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌ 12 అర్ధరాత్రి.. హూండరస్‌ మహిళ సాండ్రా సన్‌చెజ్‌ తన కూతురు యెనేలాతో పాటు అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను అడ్డుకున్న భద్రతా బలగాలు.. యెనేలాను ఆమె నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో వారి మధ్య వివాదం తలెత్తగా భయపడిన యెనేలా బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న ఫొటో జర్నలిస్టు జాన్‌ మూరే కెమెరాను క్లిక్‌మనిపించారు. తల్లికి దూరమవుతాననే భయంతో హృదయవిదారకంగా ఏడుస్తున్న యెనేలా ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో గురువారం నాటి ప్రదానోత్సవంలో ఆయన అవార్డు దక్కించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటున్న శరణార్థుల కళ్లల్లో భయాన్ని నేను చూశాను. మానవత్వానికి మచ్చగా మారుతున్న వలస విధానాల కారణంగా చోటుచేసుకున్న హింస గురించి.. నా ఫొటో ద్వారా పాలకులకు ఓ కొత్త, విభిన్నమైన స్టోరీని చెప్పాలనుకున్నాను. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ ఫొటో ఓ చిన్న ఉదాహరణ మాత్రమే’ అని తన అనుభవాలు పంచుకున్నారు.

 

చదవండి : (నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు)

కాగా ఈ ఫొటోతో పాటు అమెరికా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న మరిన్ని ఫొటోలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితం కాగా... ట్రంప్‌ సర్కారు తీవ్ర విమర్శల పాలైంది. అమెరికా సెక్యూరిటీ హోంలాండ్‌ విభాగం‌... ఆర్థిక వలసదారులకు మాత్రమే తమ దేశం వ్యతిరేకమని, ఇక మనుషుల అక్రమ రవాణా కారణంగానే సరిహద్దుల్లో పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏమీలేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ‘జీరో టాలరెన్స్‌’  విధానంలో ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇటువంటి ఫొటోలు ఎంతగానో ఉపయోగపడతాయని జాన్‌ మూరేకు అవార్డు అందచేసిన న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు. మొత్తం 4, 738 ఫొటోగ్రాఫర్లు పంపిన 78, 801 ఫొటోల్లో యెనేలా ఫొటోను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

చదవండి : ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!

ఇక ఏదైనా ఒక సమస్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చను లేవనెత్తడంలో ఫొటోలు ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా మూడేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్‌ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో, ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకతను వివరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top