ట్రంప్‌ అభిశంసన: తులసి అనూహ్య నిర్ణయం

Tulsi Gabbard Criticized For Present Vote On Trump Impeachment - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఓటింగ్‌ సందర్భంగా.. డెమొక్రటిక్‌​ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన తులసి గబ్బార్డ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్‌ను అభిశంసించే తీర్మానానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఆమె ఓటు వేయలేదు. అభిశంసన సందర్భంగా సభలో ఉన్నట్లు(ప్రెజెంట్‌) మాత్రమే ఆమె ఓటు వేశారు. ప్రతినిధుల సభలో తులసి వ్యవహారశైలి పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభలో ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలినట్లయింది. ఇక తదుపరి సెనేట్‌లో అభిశంసనను ట్రంప్‌ ఎదుర్కోనున్నారు.(అభిశంసనకు గురైన ట్రంప్‌

ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తులసి గబ్బార్డ్‌ ఓటు వేయకపోవడం ద్వారా పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీపడాలనుకున్న మహిళ.. ట్రంప్‌ను సమర్థిస్తున్నారా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తులసి గబ్బార్డ్‌ మాట్లాడుతూ.. తనకు అన్నింటికన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ‘నా నిర్ణయంతో కొందరు ఏకీభవించకపోవచ్చు. అయితే నేనెంతగానో ప్రేమించే నా దేశమే నాకు ముఖ్యం. 658 పేజీల అభిశంసన నివేదిక చదివిన తర్వాత.. అందుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయాలనే విషయంలో నాకు స్పష్టత లేకుండా పోయింది. నిజానికి ఓటింగ్‌ సమయంలో నేను పూర్తి స్పృహలో లేను. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ తను చేసిందానికి పశ్చాత్తాపపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేశాన్ని విభజించే ఎటువంటి నిర్ణయాలకు నేను అనుకూలం కాదు’ అని తులసి చెప్పుకొచ్చారు. అదే విధంగా అధ్యక్షుడిని గద్దె దింపేందకు కేవలం రాజకీయ అంశాలే ముఖ్యకారణం కాకూడదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. (విలక్షణ వ్యక్తిత్వం.. తులసి గబ్బార్డ్‌ సొంతం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top