అవును.. సీరియస్‌గా ఆలోచిస్తున్నా

For the doctrine of faith Adherence to philosophy Tulsi Gabbard - Sakshi

నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే తత్త్వం.. ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో మెప్పించగల చతురత.. యుద్ధరంగంలో శత్రువులను మట్టికరిపించే వ్యూహం.. నచ్చని అంశాలను నిర్భయంగా వ్యతిరేకించే నిక్కచ్చితనం.. వివాదాలను సైతం దీటుగా ఎదుర్కొనే దృఢచిత్తం.. అన్నీ కలిస్తే.. తులసి గబ్బార్డ్‌! ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అర్హత నూటికి నూరుపాళ్లు ఆమెకే ఉందంటారు తులసి సన్నిహితులు.

‘అవును.. ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మా దేశ దశ దిశల గురించిన శ్రద్ధ నాకు ఉంది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను’  అంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై తన మనసులోని మాటను బయటపెట్టారు డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్‌ సభ్యురాలు తులసి గబ్బార్డ్‌. అన్నీ సజావుగా సాగితే ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడం పెద్ద సమస్యేమీ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారందరి కంటే కూడా తులసే ఓ మెట్టు పైన ఉన్నారని అంటున్నారు ఆమె సహసభ్యులు. ఒకవేళ వారి మాటలు గనుక నిజమైనట్లైతే అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కుతారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా... ఇలా పలు రికార్డులు ఆమె సొంతమవుతాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే తులసి హిందువు అని తెలియగానే చాలా మంది ఆమె ఇండో అమెరికన్‌ అని పొరబడ్డారు. కానీ ఆమె అమెరికన్‌ సమోవా సంతతికి చెందిన వారు!

తల్లి ద్వారా హిందూ ధర్మమార్గంలోకి
తనను తాను కర్మయోగిగా చెప్పుకొనే తులసి టీనేజ్‌ నుంచే హిందూధర్మాన్ని పాటించడం మొదలు పెట్టారు. అమెరికన్‌ సమోవా సంతతికి చెందిన మైక్‌ గబ్బార్డ్‌.. యూరోపియన్‌ సంతతికి చెందిన కరోల్‌ దంపతుల ఐదుగురు సంతానంలో తులసి నాలుగోవారు. క్యాథలిక్‌ ధర్మాన్ని పాటించే తండ్రి, హిందూ ధర్మాన్ని పాటించే తల్లి.. ఇలా చిన్ననాటి నుంచే తులసికి భిన్న మతాచారాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తల్లివైపే మొగ్గు చూపిన ఆమె ఇప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. చైతన్య మహాప్రభువు నెలకొల్పిన గౌడీయ వైష్ణవాన్ని ఆచరించే తులసితో పాటు.. ఆమె తోబుట్టువులు భక్తి, జై, నారాయణ్, బృందావన్‌లు కూడా హిందూ ధర్మాన్నే పాటిస్తున్నారు. భగవద్గీతను తన ఆధ్యాత్మిక గ్రంథంగా భావించే తులసి హిందూ సంప్రదాయం ప్రకారమే తన స్నేహితుడు అబ్రహం విలియమ్స్‌ను (2015లో) పెళ్లాడారు.

సైనికురాలిగా ఉండేందుకే మొగ్గు
2002లో హవాయి స్టేట్‌ లెజిస్లేటివ్‌గా ఎన్నియ్యారు తులసి గబ్బార్డ్‌. తద్వారా అత్యంత పిన్న వయస్సు(21)లో ఈ పదవి అలంకరించిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 2004లో అమెరికా ఇరాక్‌తో యుద్ధం ప్రకటించే నాటికే ఆమె సైన్యంలో చేరారు. అదే సమయంలో హవాయి లెజిస్లేచర్‌కు తిరిగి ఎంపికవ్వడం కోసం జరిగిన ఎన్నికల్లో పోటీ పడాలని నిశ్చయించుకున్నారు. కానీ యుద్ధ కారణాల రీత్యా పరాయిదేశంలో ఉన్న ఓ వ్యక్తి తనను ఎన్నుకున్న ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారంటూ... తులసిపై ప్రత్యర్థి విమర్శల దాడికి దిగడంతో.. తాను సైనికురాలిగా ఉండేందుకే ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు. పదవికి రాజీనామా చేసి 2005లో ఇరాక్‌ యుద్ధంలో పాల్గొని తదనంతర కాలంలో మేజర్‌గా ర్యాంకు కూడా పొందారు. అంతేకాకుండా 2009లో కువైట్‌తో యుద్ధం జరిగినపుడు హవాయి నేషనల్‌ గార్డుగా, ఆర్మీ కెప్టెన్‌గా ఆమె సేవలు అందించారు. ఓ సైనికురాలిగా పూర్తిస్థాయి బాధ్యతలు నెరవేర్చడం కోసం వైవాహిక జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల భర్త నుంచి విడిపోయారు ఆమె.

భారత్‌ అంటే ప్రత్యేక అభిమానం
హిందూ ధర్మాన్ని పాటించే తులసికి కర్మభూమిగా పేరొందిన భారతదేశం అంటే ప్రత్యేక అభిమానం.  ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వీసా నిరాకరించిన సమయంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. 2014లో ప్రధాని హోదాలో మోదీ న్యూయార్క్‌లోని మేడిసన్‌ స్క్వేర్‌లో ప్రసంగించిన సమయంలో ఆయనను కలిసి అభినందించడంతో పాటు.. ప్రమాణస్వీకారం చేసే సమయంలో తన వద్ద పెట్టుకునే భగవద్గీతను మోదీకి బహూకరించారు. ఆమె ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ కాంగ్రెషనల్‌ ఇండియా కాకస్‌ (భారత్‌కు మద్దతు తెలిపే గ్రూపు) కో చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 

హిల్లరీకి వ్యతిరేకంగా ప్రచారం!
డెమోక్రటిక్‌ పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే తన విలక్షణ వ్యక్తిత్వంతో కీలక నాయకురాలిగా ఎదిగారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తులసి.. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి వార్తల్లో నిలిచారు. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి హిల్లరీకి పోటీగా బెర్నే సాండర్స్‌ను ప్రతిపాదించి మరీ ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ విషయంలో పలువురితో విభేదాలు తలెత్తడంతో పార్టీ నేషనల్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు కూడా.

వివాదాలు- విదేశాంగ విధానం...
టెర్రరిజాన్ని వ్యతిరేకించే తులసి... 2017లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ను కలిసేందుకు రహస్యంగా అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనకు హౌజ్‌ ఎథిక్స్‌ కమిటీ అనుమతి ఉందని చెప్పినప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ‘ అతడిని కలిసే అవకాశం వచ్చింది. సిరియా ప్రజల పట్ల నిజమైన బాధ్యత ఉన్న వారెవరైనా నాలాగే చేస్తారు. వారి కష్టాలను స్వయంగా చూసే అవకాశం దక్కింది. శాంతిని పెంపొందించాలంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. సిరియా ఎప్పుడైనా అమెరికాపై దాడి చేసిందా అని అక్కడి ప్రజలు అడిగినపుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి తప్పు ఎవరిది’ అంటూ తులసి తన చర్యను సమర్థించుకున్నారు.

అంతేకాదు ఆల్‌ఖైదా, ఐసిస్‌ వంటి ఉగ్రసంస్థలకు ప్రత్యక్ష, పరోక్షంగా మద్దతు తెలిపే దేశాలకు అమెరికా సహకరించకూడదని, వారికి నిధులు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ అదే ఏడాది కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు తులసి. ఈ సందర్బంగా..‘ ఐసిస్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు సమకూర్చేది నేనైనా, మరెవరైనా సరే వారికి తప్పకుండా శిక్షపడాలి. వాళ్లను జైళ్లో పెట్టి తీరాలి. ఇటువంటి నిబంధనలను ఏళ్ల నాటి నుంచి అమెరికా ఉల్లంఘిస్తోంది’  అని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పిన ధీశాలి తులసి. అందుకే.... మెడలో హారం, చేతిలో భవద్గీతతో విలక్షణమైన ఆహార్యం కలిగి ఉండే తులసి గబ్బార్డ్‌ అంటే ఇండో అమెరికన్లకు ప్రత్యేక అభిమానం. అధ్యక్ష పదవికి ఆమె పోటీచేయనున్నారనే విషయాన్ని ప్రకటించింది కూడా ఇండో అమెరికనే కావడం విశేషం. ఇక అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండో అమెరికన్లు తులసి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆమెకు భారీ మెజార్టీ చేకూర్చడంలో తమ వంతు సాయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో!

- సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top