వారి హత్యకు రష్యా సుపారీ.. ట్రంప్‌పై విమర్శలు!

Trump Faces Criticism Over Russian Bounties To Assassinate US Troops - Sakshi

అఫ్గనిస్తాన్‌లో అమెరికా బలగాల హత్య

ట్రంప్‌పై డెమొక్రాట్ల ఫైర్‌

వాషింగ్టన్‌: రష్యా ప్రోద్భలంతోనే ఉగ్రవాదులు అమెరికా సైనికులను హతమార్చారన్న వార్తలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రశ్నించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందు తలవంచిన ట్రంప్‌.. సైనికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అఫ్గనిస్తాన్‌లోని ఉగ్రమూకలను అణచివేసేందుకు అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు తమ బలగాలను అక్కడ మోహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019లో ఉగ్రవాదులు.. పేలుడు పదార్థాలు నింపిన కారుతో యూఎస్‌ మెరైన్స్‌(అమెరికా నావికా దళ) కాన్వాయ్‌పై దాడి చేయగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. అఫ్గనిస్తాన్‌లోని యూఎస్‌ వైమానిక స్థావరం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అమెనికా నిఘా వర్గాలు.. తమ సైనికుల మరణం వెనుక రష్యా హస్తం ఉందని తేల్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవల సంచలన కథనం ప్రచురించింది. ఆ తర్వాత అసోసియేటెడ్‌ ప్రెస్‌ కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. అమెరికా బలగాలను మట్టుబెట్టేందుకు రష్యా మిలిటరీ ఉగ్రవాదులకు సుపారీ ఇచ్చినట్లు ఇంటలిజెన్స్‌ అధికారులు వెల్లడించినట్లు తెలిపింది. తాలిబన్లతో చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా దృష్టిని మరల్చేందుకు రష్యా ఈ విధంగా కుట్రలు పన్నిందని పేర్కొంది. అంతేగాక ఈ విషయం గురించి నిఘా వర్గాలు ట్రంప్‌నకు నివేదించాయని వెల్లడించింది. అయితే ఈ విషయం గురించి ట్రంప్‌ గానీ, శ్వేత సౌధం లేదా అమెరికా నిఘా సంస్థ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.(వారి హత్యకు రష్యా సుపారీ ఇచ్చింది: అమెరికా)

ఈ క్రమంలో ట్రంప్‌ తీరుపై ప్రతిపక్ష డెమొక్రాట్లు ట్రంప్‌పై నిప్పులు చెరిగారు. ట్రంప్‌ నిరంకుశ పాలనలో దేశం ఎటుపోతుందో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా ఆయన ఈ విషయంపై బహిరంగంగా పుతిన్‌ను ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సైనికుల మరణంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో పలువురు డెమొక్రటిక్‌ ప్రతినిధులు శ్వేతసౌధ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై తమకు ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదని అసహనం వ్యక్తం చేశారు. సైనికుల మరణంపై ట్రంప్‌ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. అధికార రిపబ్లికన్లు మాత్రం అధ్యక్షుడిని వెనకేసుకొచ్చారు. ఇంటలెజిన్స్‌ నివేదికలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆయన దీని గురించి మాట్లాడతారని పేర్కొన్నారు. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్‌)

ఎలాంటి తప్పు చేయలేదు
అదే విధంగా వైట్‌హౌజ్‌ పత్రికా కార్యదర్శి కేలే మెకానీ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి ట్రంప్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే ఇంటలెజిన్స్‌ విభాగం.. రష్యాపై ఆరోపణలను ధ్రువీకరించనందున ఆయన సంయమనం పాటిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘ఎలాంటి తప్పు చేయలేదు. అమెరికా బలగాలను కాపాడుకునేందుకు అధ్యక్షుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు’’అని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు నేవీ హెలికాప్టర్‌ మాజీ పైలట్‌, రిపబ్లికన్‌ మైక్‌ షెరిల్‌ మాట్లాడుతూ.. రష్యాపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా తాలిబన్లతో 2020లో చర్చలు జరిపింది. ఈ మేరకు వారితో శాంతి ఒప్పందం కుదుర్చుకుని.. అఫ్గాన్‌ నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఇక ప్రస్తుతం అఫ్గాన్‌లో దాదాపు 8 వేల అమెరికా బలగాలు ఉన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top