కాలం కథకుడికి కన్నీటి వీడ్కోలు

Stephen Hawking funerals Completed In Cambridge - Sakshi

కేంబ్రిడ్జ్ : కాలం కథను వివరించిన  భౌతిక శాస్త్రవేత్త  స్టీఫెన్ హాకింగ్‌(76) అంత్యక్రియలు కేంబ్రిడ్జ్‌ పట్టణంలో శనివారం జరిగాయి. అంతకుముందు అభిమానులు, సన్నిహితులు అశ్రునయనాలతో హాకింగ్‌కు వీడ్కోలు పలికారు. గ్రేట్‌ సెయింట్‌ మేరిస్‌ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలు బైబిల్‌ చదువుతూ హాకింగ్‌ అంతిమయాత్ర కొనసాగించారు. హాకింగ్‌ పార్థివదేహం చర్చికి చేరుకోగానే అక్కడున్న గంటలను 76సార్లు మోగించారు.

అంతిమయాత్రలో ఆయన మాజీ భార్య జేన్‌ హాకింగ్‌, కొడుకు టిమోథీ హాకింగ్‌, కూతురు ల్యూసీ హాకింగ్‌, హాలీవుడ్‌ నటుడు  ఎడ్డీ రెడ్‌మేనే(హాకింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో హాకింగ్‌ పాత్ర పోషించారు), కమెడియన్ డారా ఒబ్రెయిన్‌, దర్శకుడు చార్లెస్‌ గార్డ్‌, టీవీ ప్రెసెంటర్‌ కార్లెట్‌ హాకిన్, ఇతర ప్రముఖులు, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు.  హాకింగ్ అస్థికలను ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ సమాధుల సమీపంలోనే పూడ్చిపెట్టనున్నారు.

అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి  గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అని గోన్విలె అండ్‌ కాయిస్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పుస్తకంలో విద్యార్థులు రాసుకొచ్చారు. కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో? కాలం వెనుక్కు ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని ఆ పుస్తకంలో వ్యక్తం చేశారు. ఈ ఖగోళ శాస్త్రవేత్త మార్చి 14న కన్నుమూసిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top