24 వరకు రిమాండ్‌లో నీరవ్‌

Nirav Modi's custody extended by another 28 days - Sakshi

లండన్‌ పోలీసులకు బ్రిటన్‌ కోర్టు ఆదేశం

కేసు పూర్తి విచారణ మే 30న

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టు మే 24 వరకు రిమాండ్‌ విధించింది. భారత్‌కు నీరవ్‌ను తిరిగి అప్పగించే కేసు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నీరవ్‌ గత నెలలో అరెస్టయ్యారు. అప్పటినుంచి వాండ్స్‌వర్త్‌ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రాగా, వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బత్‌నాట్‌ ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నీరవ్‌ హాజరయ్యారు.

మే 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని, ఆ రోజు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఎమ్మా ఆదేశించారు. అయితే మే 24న మరోసారి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నీరవ్‌ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్‌ను అడగగా.. ఏమీ లేవని బదులిచ్చారు. దీంతో నీరవ్‌ తరఫున వేరే బెయిల్‌ పిటిషన్‌ ఏదీ దాఖలు కాలేదని ఎమ్మా రుజువు చేసుకుని విచారణ కొనసాగించారు. నీరవ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే తిరిగి లొంగిపోరనే కారణంతో మార్చి 29న ఆయనకు కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

నీరవ్‌ కార్ల వేలం..
నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేలం వేసింది. నీరవ్‌కు చెందిన 11 కార్లు, చోక్సీకి చెందిన రెండు కార్లను ఈ–వేలం వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వారి కార్లను ఈడీ అటాచ్‌ చేసింది. వాటిని వేలం వేసుకోవచ్చని ఈడీకి మార్చిలోనే ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు అనుమతులిచ్చింది. దీంతో గురువారం వాటిని ఈడీ ఆన్‌లైన్‌లో వేలం వేసింది. మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ వేలాన్ని నిర్వహించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top