’మా అమ్మే నా హీరో.. నా లైఫ్ పిల్లర్’ | 'My mother, my hero, our next President - Hillary Clinton' | Sakshi
Sakshi News home page

’మా అమ్మే నా హీరో.. నా లైఫ్ పిల్లర్’

Jul 29 2016 8:44 AM | Updated on Aug 24 2018 6:21 PM

’మా అమ్మే నా హీరో.. నా లైఫ్ పిల్లర్’ - Sakshi

’మా అమ్మే నా హీరో.. నా లైఫ్ పిల్లర్’

ఆమె రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు. ఒక్కసారైనా ప్రజల ముందుకి రాకపోవచ్చు. ఏ రాజకీయపరమైన అంశంపైనా స్పందించకపోయి ఉండొచ్చు.

వాషింగ్టన్: ఆమె రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు. ఒక్కసారైనా ప్రజల ముందుకి రాకపోవచ్చు. ఏ రాజకీయపరమైన అంశంపైనా స్పందించకపోయి ఉండొచ్చు. కానీ, ఆమె ప్రసంగం అబ్బురపరిచింది. ఎదురుగా ఉన్నవాళ్లంతా లేచి చప్పట్లమోత మోగించేలా చేసింది. అమెరికా ప్రజల మనసుల్లో ఒక బలమైన ముద్ర వేసింది. హిల్లరీనే తమ దేశ అధ్యక్షురాలిగా ఎన్నుకుంటే బాగుంటుందేమో అని మనసులో అనుకునేలా చేసింది. అదే హిల్లరీ క్లింటన్ కూతురు చెలిసా క్లింటన్ చేసిన మాయ.

అవును.. డెమొక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్ నామినేషన్ ను ఖరారు చేసే నిమిత్తం ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో హిల్లరీ కూతురు అద్భుత ప్రసంగాన్ని చేసింది. తల్లికి దగ్గ తనయురాలు అని అనుకునేలా మాట్లాడింది. ’మా అమ్మ నా హీరో.. మన కాబోయే అధ్యక్షురాలు. ఆమె ఒక బలమైన పిల్లర్. మన దేశానికి అధ్యక్షురాలిగా నిలబెట్టండి. మీ ఓటు నా తల్లి హిల్లరీకి వేయండి’ అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. తన జీవిత నిర్మాణానికి కూడా హిల్లరీ ఒక బలమైన సౌదంగా నిలిచిందని, పనిని ప్యాషన్ గా చేయడం హిల్లరీకి చాలా ఇష్టమని 36 ఏళ్ల చెలిసా చెప్పింది.

ప్యాషన్ తో పనిచేయడమేకాకుండా మరెందరకో స్పూర్తిదాయకంగా తన తల్లి నిలిచిందని పేర్కొంది. తన విషయంలో ఆమె ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో అమెరికాలోని ప్రతి బిడ్డ విషయంలో కూడా అంతే ప్రేమ, అంతే బాధ్యతగా ఆమె ఉంటారని చెప్పింది. సేవ అంటే ప్రజాసేవే అనే తన తల్లి అనుకుంటుందని వివరించింది. ’ఆమె ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు? ఎలా ముందుకు వెళ్లగలుగుతున్నారు? అని నన్ను ఎంతోమంది అడుగుతుంటారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాను. అలా ఎందుకు సాధ్యమవుతుందంటే.. ఆమె దేనిపై పోరాడుతున్నారో.. ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరు’ అని చెలిసా చెప్పడంతో సభ మొత్తం చప్పట్ల మోత మోగింది. ఈ ప్రసంగం పూర్తయిన వెంటనే హిల్లరీ చాలా గర్వంగా ఉంది అంటూ ట్విట్టర్ లో తన కూతురు విషయంపై స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement