కక్ష్యలోకి ఇరాన్‌ ఉపగ్రహం.. అమెరికా స్పందన

Mike Pompeo Comments On Iran Military Satellite Launch - Sakshi

వాషింగ్టన్‌: మిలిటరీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపి ఇరాన్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధలను ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ఇందుకు గల్ఫ్‌ దేశం జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. ‘‘నిబంధనలను అనుసరించి ప్రతీ దేశం యునైటెడ్‌ నేషన్స్‌ను సంప్రదించి ఈ క్షిపణి ప్రయోగం భద్రతా ప్రమాణాలకు లోబడి ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇరాన్‌ తాను చేసిన పనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా దేశానికి చెందిన తొలి మిలిటరీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్స్ప్‌ బుధవారం తెలిపింది. ఈ ప్రయోగాన్ని విజయవంతగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. అణు ఒప్పందం, పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్‌- అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇరాన్‌ చేపట్టిన చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిస్టిక్‌ టెక్నాలజీని ఉపయోగించి ఇరాన్‌ మిలిటరీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని... ఈ విధంగానే ఏదో ఒకరోజు అణ్వాయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా మిలిటరీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. పొరుగుదేశాలను, అమెరికా మిత్రపక్షాలను బెదిరించేందుకే ఈ ప్రయోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందుకు స్పందించిన ఇరాన్‌.. అమెరికా సైన్యం మాటల్ని కొట్టిపారేసింది. తాము అలాంటి ప్రయత్నాలు చేయలేదని పేర్కొంది. కాగా ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగిస్తున్న అమెరికా నావికాదళ నౌకలపై దాడులు చేసేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..  తమ ఓడలకు అడ్డుతగిలితే ఇరాన్‌ నౌకలను ధ్వంసం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇరాన్‌ మాత్రం అమెరికా ఆరోపణలను కొట్టిపారేసింది. (మరోసారి వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌)

కాగా ఇరాన్‌- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2000లో ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు విధించి.. ఇరాక్, ఉత్తరకొరియాతోపాటు ఇరాన్‌ను తమ దుష్టత్రయం(2002)లో చేర్చింది. ఈ క్రమంలో లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పదవీ కాలంలో ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నారు. ఇందులో భాగంగా 2015లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌... 2019లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య  విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top