మీరు ‘కేంబ్రిడ్జ్‌’ బాధితులా?

Mark Zuckerberg Testimony to Congress - Sakshi

అందుబాటులోకి కొత్త టూల్‌

ఫేస్‌బుక్‌ సమాచారం భద్రమో కాదో తెలుసుకోవచ్చు

మెన్లో పార్క్‌ (కాలిఫోర్నియా): డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు ఎవరెవరి వ్యక్తిగత సమాచారం చిక్కిందో తెలుసుకోవడానికి ఫేస్‌బుక్‌ కొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులంతా మంగళవారం నుంచే తమ ఖాతా న్యూస్‌ఫీడ్‌లో ‘ప్రొటెక్టింగ్‌ యువర్‌ ఇన్ఫర్మేషన్‌’ అనే నోటిఫికేషన్‌ను గమనించొచ్చు.

ఇందులో ఉన్న లింకు ద్వారా వినియోగదారులు ఏయే యాప్‌లు వాడారు, ఆ యాప్‌లతో ఏ సమాచారం పంచుకున్నారో తెలుసుకోవచ్చు. డేటా దుర్వినియోగానికి కారణమైన ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ అనే యాప్‌కు వినియోగదారు లు లేదా వారి స్నేహితులు లాగిన్‌ అయ్యారో లేదో కూడా ఈ లింకు సూచించే ప్రత్యేక టూల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కేంబ్రిడ్జ్‌ అనలిటికా బారినపడినట్లుగా భావిస్తున్న 8.7 కోట్ల మందికి ఈ వివరాలతో కూడిన సందేశం వస్తుందని ఫేస్‌బుక్‌ చెప్పింది.

బాధితులకు భిన్న సందేశాలు..
‘నా డేటా చౌర్యానికి గురైందో లేదో తెలుసుకోవడం ఎలా?’ అనే టూల్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ఆ వినియోగదారుడి సమాచారం భద్రమో కాదో తెలుసుకోవచ్చు. ఒకవేళ సదరు వినియోగదారుడి డేటాను కేంబ్రిడ్జ్‌ అనలిటికా సేకరించని పక్షంలో..‘మాకున్న సమాచారం మేరకు.. మీరు, మీ స్నేహితులు డేటా దుర్వినియోగ కుంభకోణానికి కారణమైన దిస్‌ ఈజ్‌ డిజిటల్‌ లైఫ్‌కు లాగిన్‌ కాలేదు’ అనే సందేశం కనిపిస్తుంది.

ఫేస్‌బుక్‌ ద్వారా లాగిన్‌ అయి వాడుకునే వెబ్‌సైట్లు, యాప్‌లను యథావిధిగా వాడుకోవచ్చనే సమాచారం కనిపిస్తుంది. బాధిత వినియోగదారులకు మాత్రం భిన్నమైన సందేశం కనిపిస్తుంది. ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ నుంచి వారికి సందేశం వెళ్తుంది. వారి ఖాతాలకు అనుసంధానమైన యాప్‌ లు ఏవీ? థర్డ్‌పార్టీలు వారికి చెందిన ఏయే వివరాల్ని చూస్తాయి? లాంటి సమాచారంతో లింకు కనిపిస్తుంది. తమ యాప్‌ సెట్టింగ్‌లను మార్చుకోవాలనే సూచనలు కనిపిస్తాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top