అభినందన్‌ విడుదల.. ఇమ్రాన్‌ ఎక్కడ?

Imran Khan Was in Lahore To Ensure Handing Over Of Abhinandan: Report - Sakshi

లాహోర్‌: భారత్‌ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను అప్పగించినప్పుడు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. లాహోర్‌లో ఉన్నారని పాక్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. వాఘా సరిహద్దులో శుక్రవారం రాత్రి అభినందన్‌ను భారత్‌కు పాక్‌ బలగాలు అప్పగించాయి. ఈ నేపథ్యంలో అప్పగింత ప్రక్రియ సవ్యంగా సాగేలా చూసేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ శుక్రవారం సాయంత్రం లాహోర్‌ చేరుకున్నారు. అభినందన్‌ను భారత్‌కు అప్పగించడానికి కొద్ది గంటల ముందు గట్టి భద్రత నడుమ ఆయన లాహోర్‌కు వచ్చారని పాకిస్థాన్‌ అధికారులు వెల్లడించారు.

లాహోర్‌లో పంజాబ్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బుజ్దార్‌, గవర్నర్‌ చౌదరి సార్వార్‌లతో ఆయన సమావేశమయినట్టు తెలిపారు. అభినందన్‌ను క్షేమంగా స్వదేశానికి అప్పగించిన తర్వాతే ఇస్లామాబాద్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ తిరిగి వెళ్లారని వెల్లడించారు. తమది శాంతికాముక దేశమని చాటి చెప్పేందుకు, పొరుగు దేశంతో సౌహార్ద్ర సంబంధాలు కోరుకుంటున్నామన్న సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా లాహోర్‌కు వచ్చినట్టు వివరించారు. (పాక్‌ విమానాన్ని అభినందన్‌ నేలకూల్చాడిలా..!)

అభినందన్‌ను అప్పగించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశముందని ఉస్మాన్‌ బుజ్దార్‌ అభిప్రాయపడ్డారు. కాగా, భారత్‌తో తలెత్తిన ఉద్రిక్తతలను సడలించాలన్న లక్ష్యంతో తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. అభినందన్‌ విడుదలకు మొగ్గుచూపినట్టు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. (‘ఇమ్రాన్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలి’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top