ఇమ్రాన్‌ ఖాన్‌పై రామ్‌ మాధవ్‌ విమర్శలు

Ram Madhav Comments On Imran Khan Over Nobel Peace Prize - Sakshi

న్యూఢిల్లీ : భారత పైలట్‌ అభినందన్‌ను క్షేమంగా అప్పగించిన కారణంగా తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు నోబెల్‌ శాంతి ప్రకటించాలని పాకిస్తానీయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో  #NobelPeacePrizeForImranKhan అనే హ్యాష్‌ ట్యాగ్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. మరోవైపు చైనా కూడా అభినందన్‌ విడుదల ద్వారా ఇమ్రాన్‌ శాంతికి ఆహ్వానం పలికారని ప్రశంసలు కురిపించింది. కాగా ఈ విషయంపై బీజేపీ సీనియర్‌ నేత రామ్‌ మాధవ్‌ స్పందించారు.(ఇమ్రాన్‌ ఖాన్‌పై చైనా ప్రశంసలు)

శనివారం ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ... ‘ ప్రస్తుతం పాకిస్తాన్‌లో కొంత మంది ప్రజలు, ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ వాళ్లు తమ ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నారు. సరే ఆయనను బహుమతి తీసుకోమనండి. అయితే అది నిజంగా పాకిస్తాన్‌ ప్రజలకు పనికి వచ్చే అంశమేనా? ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఇమ్రాన్‌ నిజంగా భావిస్తే పాక్‌, భారత్‌లతో పాటు ప్రపంచం మొత్తానికీ కూడా మంచిదే. కానీ వాళ్లు మారతారని అనుకోవడం లేదు. వారి విధానంలో భాగంగానే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్‌ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవడమూ లేదు’ అని రామ్‌ మాధవ్‌ ఘాటు విమర్శలు చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేఫథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారత పైలట్‌ అభినందన్‌ అప్పగింతతో తగ్గినట్లుగా కన్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శాంతి చర్చలకు ఆరంభంగానే అభినందన్‌ను విడిచిపెట్టామని పాక్‌ చెబుతుండగా.. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి మాత్రమే అతడిని స్వదేశానికి అప్పగించారని భారత సైన్యం పేర్కొంది.(పాక్‌ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top