ఉగ్రవాదమే పెద్ద సమస్య

G20 Summit Begins In Argentina Capital - Sakshi

ఉగ్రసంస్థలకు నిధుల కట్టడికి బ్రిక్స్, జీ–20 దేశాలు కలిసి శ్రమించాలి

అర్జెంటీనాలో బ్రిక్స్‌ దేశాధినేతల భేటీలో మోదీ సూచన

బ్యూనోస్‌ ఎయిర్స్‌: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్ర«ధాని మోదీ శుక్రవారం అన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు బ్రిక్స్, జీ–20 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జీ–20 (గ్రూప్‌ ఆఫ్‌ 20) సదస్సు కోసం మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తుండటం తెలిసిందే. అక్కడ బ్రిక్స్‌ దేశాధినేతల మధ్య జరిగిన భేటీలో మోదీ ప్రసంగించారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని ఆయన సూచించారు.

బ్రిక్స్‌ దేశాధినేతల భేటీలోనే కాకుండా ప్రత్యేకంగానూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. వాతావరణ మార్పులపై ఈ నెల 3 నుంచి పోలండ్‌లో జరగనున్న కాప్‌24 సదస్సులో భారత్‌ కీలక, బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తుందని గ్యుటెరస్‌తో మోదీ చెప్పినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే వెల్లడించారు. బ్యూనస్‌ ఎయిర్స్‌లో నిర్వహించిన యోగా ఫర్‌ పీస్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్‌ అందించిన బహుమతి యోగా అని అన్నారు.

ట్రంప్‌ చెడగొట్టారు: పుతిన్‌
జీ–20 దేశాల మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులపై గతంలో ఉన్న ఏకాభిప్రాయాన్ని  ట్రంప్‌ చెడగొట్టారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం, వ్యాపారంలో రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తుండటాన్ని పుతిన్‌ తప్పుబట్టారు. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో జీ–20 దేశాధినేతల తొలి సదస్సు సమయం నుంచి ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను ట్రంప్‌ పాడుచేశారని పుతిన్‌ దుయ్యబట్టారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ కూడా పుతిన్‌తో గొంతు కలిపారు.  

ట్రంప్, మోదీ, అబే భేటీ
మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్‌ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ శుక్రవారం జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడాన్ని భారత్‌ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ‘జై (జేఏఐ – జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని మోదీ అన్నారు. ‘జై’ దేశాల తొలి త్రైపాక్షిక భేటీలో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని అబే చెప్పారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top