ఇప్పుడు అదెందుకో; మీరు గ్రేట్‌ సార్‌!!

Donald Trump Criticizes NASA Plan About Going To Moon - Sakshi

వాషింగ్టన్‌ : చంద్రుడిపైకి మరోసారి మనిషిని పంపేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)  సమాయత్తమవుతోంది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన స్పేస్‌ పాలసీ డైరెక్టివ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది సంతకం చేశారు కూడా. ఈ మేరకు.. తన హయాంలో మరోసారి చంద్రయాత్ర చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. నాసాను ప్రశంసిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే ప్రస్తుతం తన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘ మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. అయితే నాసా ఇప్పుడు మాట్లాడాల్సింది చంద్రుడిపైకి వెళ్లే విషయం గురించి కాదు. ఇది 50 ఏళ్ల క్రితమే జరిగింది కదా. వారు దృష్టి పెట్టాల్సిన పెద్ద పెద్ద అంశాలెన్నో ఉన్నాయి. మార్స్‌(ఇందులో చంద్రుడు కూడా భాగం), రక్షణ వ్యవస్థ, సైన్స్‌ ఇందులో ముఖ్యమైనవి’  అని ట్రంప్‌ తన తాజా ట్వీట్‌లో నాసాను విమర్శించారు.

ఈ క్రమంలో ట్రంప్‌ రెండు ట్వీట్లను పోల్చి చూస్తున్న నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా చంద్రుడు.. అంగారకుడిలో భాగమంటూ ట్రంప్‌ పేర్కొనడంపై జోకులు పేలుస్తున్నారు. ‘సార్‌ మీరు గ్రేట్‌. ఈరోజు నుంచి అందరూ గుర్తుపెట్టుకోండి. మూన్‌.. మార్స్‌లో భాగమట. ట్రంప్‌ చెప్పారు’ అంటూ వ్యంగోక్తులు విసురుతున్నారు. కాగా 1968లో ‘అపోలో-11’ ద్వారా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్, మైకేల్‌ కొల్లిన్స్, ఎడ్విన్‌ ఇ అల్డ్రిన్‌లను నాసా చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1969 జూలై 20న చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. అయితే తాజాగా మళ్లీ మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్‌కి ఆర్టెమిస్‌ అని గ్రీకు చంద్రదేవత పెట్టారు. ఈసారి చంద్రయాత్రలో మహిళా వ్యోమగాములకు కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం విశేషం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top