ఇటలీ నుంచి కొరియా వరకు నిర్మానుష్యం

Coronavirus: Spread to Every Continent Except Antarctica - Sakshi

న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) బాధితులు లక్షకు సమీపిస్తున్నారు. 2019, డిసెంబర్‌ 31వ తేదీన చైనాలో తొలి కేసు బయట పడగా, నేటికి ఒక్క అంటార్కిటికా మినహా ప్రతి ఖండానికి వైరస్‌ విస్తరించింది. భారత్‌లో రెండు కేసులు, అమెరికాలో 88 కేసులు నమోదవడం తాజా పరిణామం. మానవాళి సాధారణ జన జీవనంపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: హమ్మయ్య.. అతనికి వైరస్‌​ లేదు)

చైనా తర్వాత ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌ దేశాలను ఈ వైరస్‌ ఇప్పుడు ఎక్కువగా భయపెడుతోంది. ఇరాన్‌లో 1501 మంది వైరస్‌ బారిన పడగా 66 మంది మరణించారు. ఇటలీలో 1500 కేసులు నమోదు కాగా, 34 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 4,200 కేసులు నమోదుకాగా, 28 మంది మరణించారు. కొరియాలోని సియోల్‌ సహా పలు నగరాల్లోని పలు ఉత్పాదక కంపెనీలను మూసి వేశారు. ఇతర ఆఫీసులను మూసివేసి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించారు. బహిరంగ స్థలాల్లో ప్రజలు గుమికూడడాన్ని నిషేధించారు. ఇటలీలో దేశవ్యాప్తంగా చర్చిల్లో ప్రార్థనలను అనుమతించడం లేదు. ప్రేక్షకులు లేకుండా సాకర్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పట్టణాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఇటలీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలైన మిలన్‌లోని డ్యూమో, నవోనాలోని పియజ్జా, రోమ్‌లోని కలోసియంలో మాత్రం కొద్దిగా జన సంచారం కనిపిస్తోంది.

ఫ్రాన్స్‌లో 178 కోవిడ్‌ కేసులు నమోదుకాగా నలుగురు చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్‌లోని లవ్రీ మ్యూజియంను మూసివేశారు. మ్యూజియంకు చెందిన 2300 మంది ఉద్యోగులు సెలవులపై ఇళ్లకు వెళ్లిపోయారు. మార్చి చివరలో జరగాల్సిన ‘పారిస్‌ బుక్‌ ఫేర్‌’ను రద్దు చేశారు. అవసరమైతే దేశంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించేందుకు జపాన్‌ కొత్త చట్టం తీసుకొచ్చింది. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలను మూసివేసే అధికారం ఈ చట్టం కింద దేశ ప్రధానికి లభించింది. జపాన్‌లో 979 కేసులు నమోదుకాగా 18 మంది మరణించారు.

కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన చైనాలో ఇప్పటి వరకు 81 వేల వైరస్‌ బాధితులు నమోదుకాగా, వారిలో 2,912 మంది మరణించారు. ఆ దేశంలో వైరస్‌ను నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. అయినప్పటికీ ఒక్క సోమవారం నాడే 220 కొత్త కేసులు నమోదు కావడం విచారకరం. (కరోనా అలర్ట్‌: ‘అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top